జిడిపి పడిపోవడంతో ఆందోళన లేదు, వేగంగా పుంజుకొంటుంది 

గత క్వార్టర్ లో జిడిపి అతి తక్కువగా మైనస్ 23.9 శాతంకు పడిపోవడం పట్ల ఆందోనళన చెందనవసరం లేదని, అతి వేగంగా పుంజుకొంటుందని భారత ప్రభుత్వ ప్రధాన ఆర్ధిక సలహాదారుడు కృష్ణమూర్తి సుబ్రమణియన్ భరోసా వ్యక్తం చేశారు. 
 
లాక్ డౌన్ తొలగిస్తూ వస్తున్నా తర్వాత ఉక్కు, సిమెంట్ వంటి ఎనిమిది కీలక రంగాలలో ఈ మార్పు కనిపిస్తున్నదని ఆయన చెప్పారు. దాదాపుగా కరోనా కన్నా ముందు కాలంనాటితో 90 శాతంకు చేరుకున్నాయని తెలిపారు. 
 
బిజినెస్ లైన్ దిన పత్రిక జరిపిన “ఎంత వేగంగా ఆర్ధిక వ్యవస్థ పుంజుకొంటుంది?” అంశంపై వెబినార్ లో ఆ పత్రిక సంపాదకుడు రఘువీర్ శ్రీనివాసన్ తో మాట్లాడుతూ జనసాంద్రత ఎక్కువగా ఉండడంతో ప్రపంచంలోనే అతి కఠినంగా లాక్ డౌన్ అమలు జరిపామని గుర్తు చేశారు. 
 
అమెరికా, బ్రెజిల్ వంటి దేశాల్లో ప్రజల ప్రాణాలకన్నా ఆర్ధిక వృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడంతో ఎటువంటి దారుణ పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చిందో చూశామని ఆయన గుర్తు చేశారు. అయితే భారత ప్రభుత్వం ప్రజల ప్రాణాలకు ప్రాధాన్యత ఇచ్చి, అత్యంత మానవీయంగా కరోనా ఎదుర్కొనే సమయంలో విధానాలు అమలు పరచినదని చెప్పారు.
గత కొద్దీ సంవత్సరాలుగా వృద్ధి రేట్ తగ్గుతూ వస్తున్నా ఈ సంవత్సరం ఫిబ్రవరి నాటికి అన్ని కీలక రంగాలలో వృద్ధి రేట్ గణనీయంగా పెరగడం చూశామని, అయితే మార్చ్ లో అనుకోకుండా లాక్ డౌన్ రావడంతో తిరోగమనం తప్పలేదని పేర్కొన్నారు.
 
కరోనా రాని పక్షంలో వృద్ధి రేట్ గత క్వార్టర్ లో గత కొన్ని సంవత్సరాలకన్నా చాల ఎక్కువగా ఉండేదని చెప్పుకొచ్చారు. ఎవ్వరం అనుకోకుండా కరోనా మహమ్మారి ఎదురు కావడంతో అన్ని అంచనాలు తలకిందులయ్యాయని తెలిపారు. పైగా ఈ కాలయంలో అనిశ్చిత పరిస్థితులు కూడా నెలకొన్నాయని అన్నారు. 
 
ఒక విధంగా ఇదొక్క మంచి అవకాశం కూడా ఇస్తుందని సుబ్రమణియన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుత పరితిత్తులను 2001 నాటి ఆసియా ఆర్ధిక సంక్షోభంతో పోల్చుతూ ఆ సమయంలో మన వృద్ధి రేట్ 4 శాతం కన్నా తక్కువగానే ఉండేదని తెలిపారు. 
 
అయితే ఆ పరిస్తితులను ఎదుర్కోవడం కోసం వాజపేయి ప్రభుత్వం పలు ఆర్ధిక సంస్కరణలను రెండు, మూడేళ్లపాటు అమలు పరచిన్నట్లు గుర్తు చేశారు. వాటి ఫలితంగానే యుపిఎ-1 ప్రభుత్వం ఎటువంటి సంస్కరణలను చేపట్టాక పోయినా 8 శాతం వరకు వృద్ధి రేట్ ను సాధించిందని వివరించారు. 
 
ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం కీలకమైన సంస్కరణలను అమలుకు ఉపక్రమించిందని తెలుపుతూ మొదటగా వ్యవసాయ మార్కెట్ చట్టంలో తీసుకొస్తున్న సంస్కరణల కారణంగా మొట్ట మొదటి సారిగా మన రైతులకు తమ ఉత్పత్తులను తాము కోరుకొన్న చోట ఎక్కువ ధరకు అమ్ముకొనే అవకాశం కల్పిస్తుందని చెప్పారు. 
 
నిత్యావసర వస్తువుల చట్టం కారణంగా ఆహార ధాన్యాల నిల్వలు అన్నింటిని అక్రమ నిల్వలుగా పరిగణిస్తూ వచ్చామని, ఇప్పుడు ఆ చట్టాన్ని తీసివేస్తున్నామని తెలిపారు. 
 
గత ఆర్ధిక సర్వేలో మనం అనుసరిస్తున్న సోషలిస్ట్ విధానాలకు స్వస్తి పలుకుతూ  ప్రైవేటీకరణ ద్వారా కీలక రంగాలలో పెట్టుబడులు ఆకర్శించాలని నిర్ణయించామని సుబ్రమణియన్ గుర్తు చేశారు. ఇప్పటి వరకు ప్రైవేటీకరణ అంటే ఏదో తప్పుచేస్తున్నామని నూన్యతాభావం మనలో నెలకొన్నదని చెప్పారు. 
 
పలు రకాల కార్మిక చట్టాలను నాలుగు కోడ్ లుగా వర్గీకరిస్తున్నామని గుర్తు చేశారు. దాని వల్లన డిమాండ్ ను బట్టి కార్మికులను మార్చుకొనే సౌలభ్యం పరిశ్రమలకు లభిస్తుందని తెలిపారు. ఇప్పుడు పరిశ్రమలు 50కు పైగా ఫారాలను పూర్తి చేయవలసి వస్తుందని, వాటిని కుదించి భారం తగ్గిస్తున్నామని వివరించారు. 
 
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఈ సంస్కరణల అమలుకు 16 రాష్ట్రాలు సిద్దమయ్యాయని పేర్కొన్నారు. మరోవంక మౌలిక సదుపాయాల కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టడం ద్వారా ఉపాధి అవకాశాలు సృష్టించే అవకాశం ఉంటుందని చెప్పారు. చైనా నుండి పలు కంపెనీలు బైటకు వస్తూ ఉండడంతో వాటిల్లో కొన్ని మన దేశానికి పెట్టుబడులు తీసుకొచ్చే అవకాశం ఉన్నదని సుబ్రమణియన్ విశ్వాసం వ్యక్తం చేశారు. 
 
కొందరు సూచిస్తున్న విధంగా ప్రభుత్వం కేవలం నగదు పంపిణి  చేయడం ద్వారా మార్కెట్ లో డిమాండ్ పెంపొందించడం ఆర్ధిక వృద్ధికి దారితీయదని స్పష్టం చేశారు. నగదు అందించడంకన్నా వినియోగ ప్రోత్సాహకాలు ఎక్కువ ప్రయోజనకారి కాగలవని తెలిపారు. 
 
అయితే ప్రస్తుత పరిస్థితులలో ప్రభుత్వం రూ 2.10 లక్షల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణతో తన లక్ష్యాన్ని చేరుకోలేక పోవచ్చని చెప్పారు. రిలయన్స్ 20 వారాలలో దాదాపు ప్రభుత్వపు పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం మేరకు ఆస్తులను సమకూర్చుకోవడాన్ని ప్రస్తావిస్తూ ఒక వ్యక్తి నిర్ణయంతో ఉండే కంపెనీలతో ప్రభుత్వాన్ని  పోల్చలేమని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం అనేక వ్యవస్థలకు జవాబుదారిగా ఉంటుందని గుర్తు చేశారు.
 
కరోనా వ్యాక్సిన్ వచ్చే వరకు పరిస్థితులు అస్థిరంగా ఉండే అవకాశం ఉన్నదని చెబుతూ ప్రభుత్వం ఒక వంక దేశంలో వ్యాక్సిన్ తయారీని ప్రోత్సహిస్తూ, మరో వంక రష్యా నుండి దిగుమతికి ప్రయత్నాలు చేస్తున్నదని తెలిపారు.