నిజాం పాలనకు.. నేటి కేసీఆర్ పాలనకు తేడా లేదు  

అప్పటి రజాకార్ల పాలన, నిజాం పాలనకు ఇప్పటి కేసీఆర్ పాలనకు మధ్య వ్యత్యాసం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. `చలో అసెంబ్లీ’ కార్యక్రమం సందర్భంగా శుక్రవారం బీజేపీకి నేతలు, కార్యకరతలపై పోలీసులను ప్రయోగించి నిర్బంధాలు, అక్రమ అరెస్ట్ లకు పాల్పడటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
 పోలీసుల లాఠీదెబ్బలు తట్టుకొని మరీ శుక్రవారం అసెంబ్లీకి తరలివచ్చిన బిజెపి కార్యకర్తలు శుక్రవారం ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని కితాబిచ్చారు.  ఉద్యమ కాలంలో సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేసిన కేసీఆర్.. అధికారంలోకి రాగానే మాటమార్చడంలో ఆంతర్యమేంటని నిలదీశారు. 
 
సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించే వరకు బిజెపి ఉద్యమం ఆగదని తేల్చి చెప్పారు. 
అమరవీరుల చరిత్రను తెరమరుగు చేసి కేసీఆర్ కుటుంబ చరిత్రను రాబోయే తరాలకు అందించాలనే కుట్రలో భాగంగానే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం లేదని ఆరోపించారు. 
 
అసెంబ్లీ సాక్షిగా నిజాంను పొగిడిన కేసీఆర్ తెలంగాణ ప్రజలను అవమానపర్చారని మండిపడ్డారు. కారు స్టీరింగ్ మా చేతుల్లో ఉందని ఎంఐఎం ప్రకటించినా కేసీఆర్ నోరు మెదపలేదని సంజయ్ గుర్తు చేశారు. ఎంఐఎం చేతిలో బానిసగా బతుకాలనుకుంటున్న కేసీఆర్ తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
మైనారిటీ సంతుష్టీకరణ విధానాలు, ఓటు బ్యాంకు రాజకీయాలతో కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని సంజయ్ విమర్శించారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసు అధికారుల్లో కొంతమంది రాష్ట్ర ప్రభుత్వానికి కొమ్మకాయడం సరైనది కాదని హితవు చెప్పారు. అసెంబ్లీ ముట్టడికి వెళ్లిన బిజెపి కార్యకర్తలపై పోలీసులు దారుణంగా ప్రవర్తించారని దుయ్యబట్టారు.
 
సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలంటూ బీజేపీ అసెంబ్లీ ముట్టడికి పిలుపు ఇవ్వడంతో అసెంబ్లీ పరిసరాలలో పోలీసులు భారీగా మోహరించారు. అసెంబ్లీ ముట్టడికి రాష్ట్రం నలుమూలల నుంచి వస్తున్న ఆ పార్టీ నేతలను, కార్యకర్తలను ఎక్కడికక్కడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనేకమందిని గృహనిర్బంధం చేశారు.