భారత్‌-చైనా మధ్య ఐదు అంశాల్లో ఏకాభిప్రాయం!

గత కొంత కాలంగా భారత్‌-చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలు తొలగిపోయేలా ఇరు దేశాల మధ్య ఐదు అంశాల్లో ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలుస్తోంది. 
 
రష్యా రాజధాని మాస్కోలో జరుగుతున్న షాంఘై కో ఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ (ఎస్‌సిఒ) సదస్సులో భాగంగా ఇరు దేశాల విదేశాంగ మంత్రులు చర్చల్లో ఈ మేరకు ఒప్పందానికి వచ్చినట్లు సమాచారం. భారత్‌, చైనా విదేశాంగ మంత్రులు ఎస్‌.జైశంకర్‌, వాంగ్‌ యీ  సరిహద్దుల్లో తలెత్తిన విభేదాల గురించి చర్చించారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 
 
ఈ సందర్భంగా చైనా ఆర్మీ సరిహద్దుల్లో పదేపదే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న తీరు, భారీగా సైనిక బలగాలు, యుద్ధ ట్యాంకుల మోహరింపుపై జైశంకర్‌ అభ్యంతరాలు లేవనెత్తినట్లు తెలుస్తోంది. సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంబడి యథాతథ స్థితిని మార్చే ప్రయత్నాలను ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. 
 
విధంగా సరిహద్దుల్లో శాంతి స్థాపన, సుస్థిరతకై సరైన చర్యలు తీసుకుంటూ ముందుకు సాగాలని జైశంకర్‌ సూచించినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
 
ఇరువురు మంత్రుల మధ్య కుదిరిన ఏకాభిప్రాయం ప్రకారం ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలను పటిష్టం చేసుకుంటూ విభేదాలు, వివాదాలుగా మారకుండా ఇరు వర్గాలు చొరవ చూపాలి. ఇరు వర్గాల సైనిక బలగాలు చర్చలు కొనసాగిస్తూ, త్వరగా ఉపసంహరణకు ఉపక్రమించి, సమదూరం పాటిస్తూ ఉద్రిక్తతలు చల్లారేలా చర్యలు తీసుకోవాలి. 
 
భారత్‌- చైనా సరిహద్దు వ్యవహారాల్లో ఇప్పటికే కుదిరిన ఒప్పందాలు, ప్రోటోకాల్స్‌ను పాటిస్తూ, శాంతి పెంపొందేలా చూడాలి. సరిహద్దుల్లో తలెత్తిన పరిస్థితులపై స్పెషల్‌ రిప్రెజంటేటివ్‌ మెకానిజం ద్వారా చర్చలు కొనసాగించాలి. 
 
బార్డర్‌లో విభేదాలు సమసిపోయి, ఇరు వర్గాల్లో పరస్పరం విశ్వాసం నింపి, శాంతి, సుస్థిరత నెలకొనేలా ఇరు దేశాలు సమర్థవంతంగా పనిచేయాలి.
 
ఇదిలా ఉంటే అయిదుగురు భారత పౌరులను చైనా సైనికులు అపహరించారు. ఈ విషయాన్ని భారత సైన్యం చైనా అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో  ఆ అయిదుగురిని తమ భూభాగంలోనే గుర్తించామని, వారిని అప్పగించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చైనా బదులిచ్చింది.
 

ఏకాభిప్రాయం వచ్చిన విషయాలివే..

1. ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలను పటిష్టం చేసుకుంటూ

విభేదాలు, వివాదాలుగా మారకుండా ఇరు వర్గాలు చొరవ చూపాలి

2. ఇరు వర్గాల సైనిక బలగాలు చర్చలు కొనసాగిస్తూ…

త్వరగా ఉపసంహరణకు ఉపక్రమించి, సమదూరం పాటిస్తూ…

ఉద్రిక్తతలు చల్లారేలా చర్యలు తీసుకోవాలి. 

3. భారత్‌- చైనా సరిహద్దు వ్యవహారాల్లో ఇప్పటికే కుదిరిన…

ఒప్పందాలు, ప్రోటోకాల్స్‌ను పాటిస్తూ, శాంతి పెంపొందేలా చూడాలి

4. సరిహద్దుల్లో తలెత్తిన పరిస్థితులపై స్పెషల్‌ రిప్రెజంటేటివ్‌..

 మెకానిజం ద్వారా చర్చలు కొనసాగించాలి

5. బార్డర్‌లో విభేదాలు సమసిపోయి, ఇరు వర్గాల్లో…

పరస్పరం విశ్వాసం నింపి, శాంతి, సుస్థిరత నెలకొనేలా చూడాలి.