కాంగ్రెస్‌లో గులాం నబీ ఆజాద్‌పై వేటు

కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీని ప్రశ్నించేవారెవ్వరు లేకుండా చేయడం కోసం సీనియర్లకు ఉద్వాసన పలకడం ప్రారంభమైనది. కాంగ్రెస్ అధిష్ఠానం పునర్ వ్యవస్థీకరించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో పలువురు సీనియర్లను పక్కన పెట్టారు. 
 
ముఖ్యంగా గత నెల పార్టీలో సంస్థాగత సంస్కరణలు కోరుతూ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ వ్రాసిన 23 మందిలో ముఖ్యమైన రాజ్యసభలో పార్టీ నేత గులాబీ నబి ఆజాద్ ను ప్రాధాన్యతను పూర్తిగా తగ్గించారు. 
 
పార్టీ వర్కింగ్‌ కమిటీ (సిడబ్ల్యుసి)తో పాటు కీలకమైన సంస్థాగత పదవుల్లోనూ భారీ మార్పులు చేసింది. సుదీర్ఘకాలంగా వివిధ రాష్ట్రాల ఇన్‌చార్జిగాను, సంస్థాగత వ్యవహారాల కార్యదర్శిగాను, కేంద్రమంత్రిగాను ఆజాద్‌ విధులు నిర్వహించిన సంగతి తెలిసిందే. అలాగే అంబికా సోని, మోతీలాల్‌ ఓరా, మల్లిఖార్జున్‌ ఖర్గేలను కూడా పదవుల నుండి తొలగించారు.
 
వారిస్థానంలో సిడబ్ల్యుసిలోకి పి. చిదంబరం, తారిఖ్‌ అన్వర్‌, రణదీప్‌ సుర్జేవాలా, జితేంద్ర సింగ్‌లను రెగ్యులర్‌ సభ్యులుగా నియమించింది. కాగా, చిదంబరం, సుర్జేవాలాలు ఇప్పటివరకు ప్రత్యేక ఆహ్వానితులుగా ఉండేవారు. ప్రధాన కార్యదర్శిగా నియమించిన రణదీప్‌ సుర్జేవాలాకు కర్ణాటక వ్యవహారాలను కూడా అప్పగించింది.
 
మరో సభ్యుడు జితేంద్ర సింగ్‌కు అస్సాం బాధ్యతలు అప్పగించింది.ఇప్పటి వరకూ యూపీ కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ గా ఉన్న ఆజాద్ ను తప్పించి, ఉత్తర ప్రదేశ్ వ్యవహారాలను పూర్తిగా ప్రియాంక గాంధీకి అప్పజెప్పారు.

ఆజాద్‌తో పాటు లేఖపై సంతకాలు చేసిన జితిన్‌ ప్రసాద్‌, ముకుల్‌ వాస్నిక్‌లకు మాత్రం పదోన్నతి కల్పించింది. జితిన్‌ ప్రసాద్‌ను యుపి నుండి తప్పించి త్వరలో ఎన్నికలు జరగనున్న పశ్చిమబెంగాల్‌కు ఇన్‌చార్జిగా నియమించింది. కాగా, లేఖపై సోనియాకు క్షమాపణలు చెప్పిన ముకుల్‌ వాస్నిక్‌ను మధ్యప్రదేశ్‌ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. 
 
తారిఖ్‌ అన్వర్‌ను కేరళ ప్రధాన కార్యదర్శిగాను, తమిళనాడు ఎంపి మాణిక్యం ఠాగూర్‌కు తెలంగాణ ఇన్‌చార్జిగా నియమించింది. ఆంధ్రప్రదేశ్‌ ఇన్‌చార్జిగా ఉమెన్‌ చాందీనే కొనసాగించారు. శశిథరూర్‌, మనీష్‌ తివారి, ఆనంద్‌ శర్మ, సనిన్‌పైలెట్‌లకు పూర్తిగా ఉద్వాసన పలికింది. మొత్తానికి రాహుల్‌గాంధీకి విధేయులుగా వుండే వారికి మాత్రమే కీలక పదవులు అప్పగించినట్లు కనిపిస్తోంది.