అంతర్వేది ఘటనపై సీబీఐ దర్యాప్తు

 
 తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కల్యాణ రథం దగ్ధమైన ఘటనపై సీబీఐ దర్యాప్తు కోరాలని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి  నిర్ణయించారు. ఈ మేరకు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు ఆయన ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాల మేరకు ఘటనపై సీబీఐ విచారణ కోరుతూ డీజీపీ కార్యాలయం కేంద్ర హోంశాఖకు లేఖ పంపింది. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించే విషయమై రేపు ఉత్తర్వులు వెలువడే అవకాశముంది. 
 
రథం దగ్ధం ఘటనపై సీబీఐ దర్యాప్తుకు ఏపీ ప్రభుత్వం కోరడాన్ని  జనసేన అధినేత పవన్ కళ్యాణ్  స్వాగతించారు. అయితే ఇది తొలి అడుగు మాత్రమే అని రథం దగ్ధం ఘటనకే సీబీఐ పరిమితం కారాదని స్పష్టం చేశారు. పిఠాపురంలో దేవతా విగ్రహాల ధ్వంసం, కొండబిట్రగుంట రథం దగ్ధం వెనుక ఎవరు ఉన్నారో సిబిఐ నిగ్గు తేల్చాలని పవన్ ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు.  
 
ఈ మూడు దుశ్చర్యలూ ఒకేలా ఉన్నాయి కాబట్టి పిఠాపురం, కొండ బిట్రగుంటల్లోని ఘటనల్నీ సిబిఐ పరిధిలోకి తీసుకు వెళ్లాలని ఆయన స్పష్టం చేశారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న అంతర్వేది ఆలయ భూములు అన్యాక్రాంతమైపోయాయిని గుర్తు చేశారు. 
 
ఈ ఆలయమే కాదు రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలు, ధర్మసత్రాల ఆస్తులు ఆన్యులపరమైపోయాయని తెలిపారు. వీటి గురించీ కూడా  సిబిఐ ఆరా తీసి ఎండోమెంట్స్ ఆస్తులకు రక్షణ ఇవ్వాలని కోరారు. వీటితో పాటు తిరుమల శ్రీవారి పింక్ డైమండ్ గురించీ సిబిఐ ఆరా తీయాలని డిమాండ్ చేశారు.  
 
అంతర్వేది ఘటన ఏపీలో కలకలం రేపుతోంది. ఇప్పటికే హిందూ  సంస్థలు,రాజకీయ పార్టీల నుంచి తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. విపక్షాల విమర్శలు, నిరసనలతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం దేవస్థానం ఇన్‌ఛార్జి ఈవోతోపాటు ఇన్‌చార్జి ఈఓ చక్రధర్ రావును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
 
ఆలయంలో రథం పునర్నిర్మాణ పనుల పర్యవేక్షణకు ప్రత్యేకాధికారిగా అదనపు కమిషనర్‌ రామచంద్రమోహన్‌ను నియమిస్తూ దేవదాయశాఖ కమిషనర్‌ ఆదేశాలు జారీచేశారు. వెంటనే అంతర్వేదికి వెళ్లాలని తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు అక్కడే ఉండాలని ఆయనను కమిషనర్‌ ఆదేశించారు.
 
ఇలా ఉండగా, అంతర్వేది ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసిన హిందువులందరినీ వెంటనే విడుదల చేయాలని.. వారిమీద పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని బీజేపీ-జనసేన కూటమి ధర్నాకు పిలుపునిచ్చింది. రాష్ట్రంలోని అన్ని కలెక్టర్, ఆర్డీవో కార్యాలయాల ఎదుట ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ధర్నా కార్యక్రమం నిర్వహించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పిలుపునిచ్చారు.