వెయ్యి మందికి పైగా చైనా వారి వీసాలు రద్దు  

జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా దాదాపు వెయ్యి మందికి పైగా చైనీస్‌ విద్యార్థులు, పరిశోధకుల వీసాలను రద్దు చేసినట్లు అమెరికా హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం వెల్లడించింది. వీరంతా చైనా సైన్యంతో సంబంధాలు కలిగి ఉండి, అమెరికాకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని డ్రాగన్‌ ఆర్మీకి చేరవేస్తున్నారనే అనుమానంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. 

అంతేగాక బానిస కార్మికుల వెట్టిచాకిరీతో ఉత్పత్తి చేసిన వస్తువులను ఇకపై తమ దేశ మార్కెట్లోకి రాకుండా అడ్డుకుంటామంటూ స్పష్టం చేస్తూ జిన్‌జియాంగ్‌లోని ఉగర్‌ ముస్లింల పట్ల చైనా అనుసరిస్తున్న వైఖరిని ఈ సందర్భంగా ప్రస్తావించింది. 

ఈ విషయాల గురించి హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం అధికార ప్రతినిధి చాద్‌ వాఫ్‌ మాట్లాడుతూ కొంతమంది చైనీయులు కరోనా వైరస్‌ పరిశోధనకు సంబంధించిన సమాచారాన్ని తస్కరించే ప్రయత్నాలు చేస్తూ అమెరికా విద్యా విధానాన్ని కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 

హాంకాంగ్‌లో ప్రజాస్వామ్య విలువలను కాలరాసేలా వ్యవహరించిన చైనా తీరుకు బదులుగా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మే 29న చేసిన ప్రకటనకు అనుగుణంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ఈ క్రమంలో సెప్టెంబరు 8, 2020 నాటికి సుమారుగా 1000 మంది చైనా జాతీయుల వీసాలను రద్దు చేసినట్లు తెలిపారు. డ్రాగన్‌ దేశ విద్యార్థులు, పరిశోధకుల నుంచి అమెరికా డేటాకు ముప్పు పొంచి ఉన్నందున ఇకపై వారికి తమ దేశంలో ప్రవేశించే అవకాశం ఉండదని స్పష్టం చేశారు. 

కాగా అమెరికాలో దాదాపు 3.60 లక్షల మంది చైనీయులు విద్యనభ్యసిస్తున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వీరి ద్వారా అక్కడి కాలేజీలకు పెద్ద మొత్తంలో ఆదాయం చేకూరుతోంది.