సుశాంత్ కోసం డ్రగ్స్ కొన్నా…ఒప్పుకున్న రియా!  

సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ కోసం తాను డ్రగ్స్​ కొన్నానని బాలీవుడ్​ హీరోయిన్​ రియా చక్రవర్తి ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. డ్రగ్స్​ కొనేందుకు తన సోదరుడు షోవిక్​ చక్రవర్తి సాయం చేశాడని చెప్పినట్టు సమాచారం. జైద్​ నుంచి డ్రగ్స్​ కొనుగోలు చేసిన శామ్యూల్​ మిరాండా తనకు ముందే తెలుసని నార్కోటిక్స్​ కంట్రోల్​ బ్యూరో (ఎన్​సీబీ) అధికారులకు రియా చెప్పినట్టు అధికారిక వర్గాలు చెబుతున్నాయి.

తన సోదరుడు షోవిక్​తో కలిసి డ్రగ్స్​ అమ్మే జైద్​తో కో ఆర్డినేట్​ చేసినట్టు ఆమె చెప్పిందంటున్నారు. అయితే, తాను నేరుగా సుశాంత్​కు డ్రగ్స్​ ఇవ్వలేదని అధికారులకు చెప్పినట్టు సమాచారం. రియాను ఎన్ సీబీ అధికారులు  ఆరు గంటల పాటు ప్రశ్నించారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఎన్ సీబీ ఆఫీసుకు వచ్చిన రియా.. సాయంత్రం 6 గంటలకు పోలీసుల ఎస్కార్ట్ తో ఇంటికి వెళ్లిపోయారు.

రియాను సోమవారం మరోసారి ప్రశ్నిస్తామని, ఆమె స్టేట్ మెంట్ రికార్డ్ చేస్తామని ఎన్ సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (సౌత్ వెస్ట్ రీజియన్ ) ముఠా అశోక్ జైన్ చెప్పారు. అనూజ్ కేశ్వానీ ఇంటిపై దాడులు చేసినట్లు తెలిపారు. విచారణ సందర్భంగా కైజన్ ఇబ్రహీం అనూజ్ గురించి చెప్పారని పేర్కొన్నారు.

అనూజ్ ఇంట్లో 590 గ్రాములి హాషిష్, 0.64 గ్రాముల ఎల్ ఎస్ డీ షీట్లు, 304 గ్రాముల మరీజునా, ఇంపోర్టెడ్ క్యాప్సూల్స్, రూ.1.85 లక్షల క్యాష్, ఇండోనేషియన్ కరెన్సీ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు

ఇలా ఉండగా, బాలీవుడ్‌ నటి రియా చక్రవర్తి అరెస్టుకు సిద్ధంగా ఉన్నారని ఆమె తరుపు న్యాయవాది సతీష్‌ మాన్‌షిండే తెలిపారు. ఈ కేసులో ఎన్‌సిబి ఇప్పటికే రియా సోదరుడితోపాటు సుశాంత్‌ ఇంటి యజమానిని అరెస్టు చేసినందున ఆమెను కూడా ఏ క్షణంలోనైనా అరెస్టుచేయవచ్చని మాన్‌షిండే చెప్పారు.
‘ఆమెను వెంటాడుతుండటం వల్ల రియా అరెస్టుకు సిద్ధమయ్యారు. ఒకరిని ప్రేమించడమే నేరమైతే, దాని పరిణామాలను ఎదుర్కోవడానికి రియా సిద్ధంగా ఉన్నారు. ఆమె నిరపరాధి. అందువల్లే బీహార్‌ పోలీసులతో పాటు సిబిఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, ఎన్‌సిబి దాఖలు చేసిన కేసుల్లో బెయిల్‌ కోసం ఏ కోర్టునూ ఆశ్రయించలేదు’ అని ఆమె తరపు న్యాయవాది సతీష్‌ తెలిపారు.