సెప్టెంబ‌ర్ 17 తర్వాత రామ ‌మందిర నిర్మాణ ప‌నులు 

అయోధ్యలో రామ్ మందిరం నిర్మాణ ప‌నులు సెప్టెంబర్ 17 తర్వాత ప్రారంభమవుతాయ‌ని రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ప్రకటించారు. హిందువులు తమ పూర్వీకులకు కృతజ్ఞతలు తెలిపిన కాలం పిత్రు ప‌క్ష్ ఈనెల 17 వ‌ర‌కు ముగియ‌నుంద‌ని, ఆ త‌రువాత ప‌నులు ప్రారంభ‌మై నిరాటంకంగా కొన‌సాగుతాయ‌ని ఆయ‌న తెలిపారు.

12,879 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఆల‌యాన్ని నిర్మించ‌డానికి దేశంలోని ప్రముఖ నిర్మాణ సంస్థలు లార్సెన్,  టౌబ్రో సిద్ధంగా ఉన్నాయ‌ని ఆయ‌న చెప్పారు. ఆలయ పునాది కోసం సుమారు 1,200 స్తంభాల‌ను భూమి నుంచి 100 అడుగుల లోతులో  ఉక్కు రహిత సామగ్రి, రాతితో నిర్మించనున్నారు. 

సుమారు 100 మంది కార్మికులు  నిర్మాణ ప‌నుల్లో పాల్గొంటార‌ని చెబుతూ వారంద‌రికీ ముందే క‌రోనా ప‌రీక్ష‌లు చేయిస్తామ‌ని ఆయ‌న తెలిపారు.  రామ మందిర నిర్మాణానికి దిగ్గజ అంతర్జాతీయ నిర్మాణ రంగ సంస్థ ఎల్‌ అండ్‌ టీ ఉచితంగా పునాదులు వేయనుంది. 

పునాది నిర్మాణాల కోసం ఎల్‌ అండ్‌ టీ ఇప్పటికే ముంబై నుంచి యంత్రాలను తరలించగా హైదరాబాద్‌ నుంచి వాటి తరలింపు ప్రారంభమైంది. ఎల్‌ అండ్‌ టీ నిర్మించే పునాదులు అత్యంత దృఢంగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. బలమైన వరదలు, తుపానులు, భూకంపాలను తట్టుకుని, వెయ్యేళ్ల వరకు చెక్కుచెదరకుండా ఉంటాయని వివరించారు.

1,500 సంవత్సరాల దాకా ఈ నిర్మాణాలకు ఎలాంటి ఢోకా ఉండబోదని పేర్కొన్నారు. ఇందుకోసం ఐఐటీ రూర్కీ, మద్రాస్‌, కేంద్ర భవనాల పరిశోధన సంస్థ (సీబీఆర్‌ఐ) బృందాలు చర్యలు తీసుకుంటాయి. పునాది పనుల తర్వాత మరో లేయర్‌ పునాదిని నిర్మించనున్నట్లు చంపత్‌రాయ్‌ వివరించారు. కాకతీయ సాండ్‌బాక్స్‌ టెక్నాలజీ ద్వారా ఈ ఆలయాన్ని నిర్మిస్తారు.