సులభతరం వాణిజ్యంలో ఏపీ -1, తెలంగాణ – 3

సులభతర వాణిజ్యం విభాగంలో తెలుగు రాష్ట్రాలు సత్తా చాటాయి. జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌ మళ్లీ అగ్ర స్థానాన్ని నిలబెట్టుకోగా, తెలంగాణ మూడో స్థానంలో ఉంది.
 
రాష్ట్ర వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక -2019 ర్యాంకింగ్స్‌ను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం విడుదల చేశారు. గతంలో రెండో స్థానంలో ఉన్న తెలంగాణ ఈసారి మూడో స్థానానికి చేరింది. రెండో స్థానాన్ని ఉత్తర్‌ప్రదేశ్‌ ఆక్రమించింది. 
 
గతంలో 12వ స్థానంలో ఉన్న యూపీ ఈసారి రెండో స్థానానికి చేరుకోవడం గమనార్హం. లాక్‌డౌన్‌ సందర్భంగా కేంద్రం ప్రకటించిన ఆత్మనిర్భర భారత్‌ను అమలు చేయడంలోనూ అన్నింటికన్నా ఏపీనే ముందు వరుసలో ఉందని కేంద్రం ప్రకటించింది.  
 
 పెరిగిన పారదర్శకత, మెరుగైన పనితీరుకు.. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ ర్యాంకింగ్‌లు అద్దం పట్టాయని ఈ సందర్భంగా ఆర్ధిక మంత్రి తెలిపారు. తొలిమూడు స్థానంలో నిలిచిన రాష్ట్రాలకు నిర్మల అభినందనలు తెలిపారు. గత సర్వే ల కంటే భిన్నంగా ఈ సారి సర్వే నిర్వహించారు. 
 
తొలిసారి పారిశ్రామిక వేత్తలు, వినియోగదారుల సర్వే చేయగా ఇదే అసలైన ర్యాంకింగ్ ప్రక్రియగా పారిశ్రామికవేత్తలుఅభి ప్రాయపడుతున్నారు. గతంలో ప్రభుత్వాలు ఇచ్చిన నివేదికల ఆధారంగా ర్యాంకింగ్ ప్రకటించేవారు. 
 
ఈసారి పారిశ్రామిక వేత్తలు సర్వే నిర్వహించగా.. ఏపీలో 187 సంస్కరణలు అమలు చేసినట్లు గుర్తించారు. అన్నింటినీ అమలు చేసినందున నూటికి నూరు శాతం మార్కులు పొందటంతో మొదటిస్థానంలో నిలిచింది.