భూవివాదాల పరిష్కారానికి జిల్లాకో ట్రిబ్యునల్  

తెలంగాణలోని రెవెన్యూ, సివిల్ కోర్టుల్లో కొన్నేండ్లుగా పెండింగ్ లో ఉన్న భూవివాదాల పరిష్కారానికి జిల్లాకో ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కేసీఆర్ ప్రభుత్వం భావిస్తోంది. తహసీల్దార్, ఆర్డీఓ, జేసీ, సీసీఎల్ఏ స్థాయిలో నిర్వహించే రెవెన్యూ కోర్టుల్లోని కేసులన్నింటినీ వీటి పరిధిలోకి తీసుకురావాలని అనుకుంటోంది. 

ఇందుకు అనుగుణంగా కొత్తగా తీసుకురానున్న రెవెన్యూ చట్టంలో మార్పులు చేస్తోంది. భూవివాదాల పరిష్కారంలో సివిల్‌‌‌‌‌‌‌‌ కోర్టులకు చెందిన జడ్జీలు, లాయర్ల భాగస్వామ్యం ఉండేలా లీగల్‌‌‌‌‌‌‌‌ ఫ్రేమ్ వర్క్ ను సిద్ధం చేస్తోంది. జిల్లా స్థాయిలో ట్రిబ్యునల్స్, రాష్ట్ర స్థాయిలో అప్పిలేట్ అథారిటీ, సెకండ్ అప్పీల్‌‌‌‌‌‌‌‌ కోసం హైకోర్టులో స్పెషల్ బెంచ్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

తహసీల్దార్, ఆర్డీఓ, జేసీ, సీసీఎల్ఏ పరిధిలోని రెవెన్యూ కోర్టుల్లో 41,961 ఎకరాలకు సంబంధించిన కేసులతో పాటు పార్ట్–బీలో చేర్చిన 9 లక్షల ఎకరాల భూములకు సంబంధించిన వివాదాల పరిష్కారానికి జిల్లాకో ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. 

వారానికోసారి నిర్వహించే రెవెన్యూ కోర్టుల్లో ఏళ్ల తరబడి వివాదాలు పరిష్కారం కావడం లేదనే ఉద్దేశంతో ప్రతిరోజూ భూములకు సంబంధించిన​ కేసులను విచారించేందుకు వీలుగా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ట్రిబ్యునల్స్ ఏర్పాటుతో రెవెన్యూ కోర్టులు రద్దు కానున్నాయి. 

రాష్ట్రంలో సివిల్, రెవెన్యూ కోర్టుల్లో కేసులు నడుస్తున్న భూములతో పాటు భూ బదలాయింపు నిషేధ చట్టంలోని భూములు, వక్ఫ్​, ఇంటి స్థలాలు, అటవీ సరిహద్దు వివాద భూములు, కుటుంబ వివాదాల్లో ఉన్న భూములన్నీ కలిపి 15 లక్షల ఎకరాల వరకు ఉన్నట్లు ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలిసింది. 

ఇందులో  1,11,258 ఎకరాలకు సంబందించిన కేసులు సివిల్​ కోర్టుల్లో, 41,961 ఎకరాలకు సంబంధించిన కేసులు రెవెన్యూ కోర్టుల్లో ఉన్నాయి. 2,18,980 ఎకరాల విస్తీర్ణంపై రెవెన్యూ శాఖకు, అటవీ శాఖకు మధ్య సరిహద్దు వివాదాలు తేలాల్సి ఉంది. వీటితో పాటు వక్ఫ్​, దేవాదాయ, ఇంటి స్థలాలు, ఇతరాత్ర భూములు 3,98,295 ఎకరాల వరకు వివాదాల్లో ఉన్నట్లు అంచనా. 

అలాగే భూ బదలాయింపు నిషేధ భూములు 95,214 ఎకరాలు ఉండగా.. కుటుంబ, రద్దు బదల్‌‌‌‌‌‌‌‌ వివాదాల్లో 2,74,697 ఎకరాలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇవే కాకుండా భూరికార్డుల ప్రక్షాళన సందర్భంగా ఎటూ తేల్చకుండా పార్ట్–బీలో చేర్చిన మరో 9 లక్షల ఎకరాలు ఉన్నట్లు తెలిసింది.