సరిహద్దుల్లో సైనికాధికారుల కీలక పర్యటనలు 

ఒక వంక సరిహద్దుల్లో చైనా కవ్వింపు చర్యలను భారత సైన్యం దూకుడుగా తిప్పికొడుతుండగా, మరోవంక భారత సైన్యాధిపతులు సరిహద్దుల్లో పర్యటనలు జరపడం ఆసక్తి కలిగిస్తున్నది.  ప్యాంగ్యాంగ్ సో సరస్సు దక్షిణ ప్రాంత, ఇతర ప్రాంతాల్లో సరిహద్దు ఉద్రిక్తలు నెలకొన్న నేపథ్యంలో ఈ పర్యటనలు ప్రాధాన్యత సంతరింప చేసుకొంటున్నాయి. 
 
ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణె ఈ ప్రాంతంలో రెండు రోజుల పర్యటన కోసం గురువారం లడఖ్ చేరుకోగా మరో వైపు భారత వాయుసేన చీఫ్ ఆర్‌కెఎస్ భదౌరియా బుధవారం నాడు తూర్పు వాయు సేన పరిధిలోని కీలక ఎయిర్ బేస్‌లను సందర్శించారు.
 
నరవాణె తన పర్యటనలో ఈ ప్రాంతంలో పనెలకొన్న పరిస్థితులు, తలెత్తిన వివాదాల గురించి తెలుసుకోనున్నారు. ఈ పర్యటనలో టాప్ కమాండర్లు తూర్పు లడఖ్‌లో నెలకొన్న భూ వివాదాల గురించి ఆర్మీ చీఫ్‌కు వివరించనున్నట్లు తెలుస్తున్నది. 
భారత భూభాగంతో పాటుగా ఇక్కడి పర్వత ప్రాంతాలను ఆక్రమించడానికి చైనా సైనికులు చేసిన ప్రయత్నాలను భారత సైన్యం తిప్పికొట్టిన విషయం తెలిసిందే. తన పర్యటనలో ఆర్మీ చీఫ్ ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న అధికారులతో పాటుగా ఇతర సైనికులను కలవనున్నారని తెలుస్తోంది.
చైనాతో ఘర్షణకు కేంద్ర బిందువుగా ఉన్న ప్యాంగ్యాంగ్ సో సరస్సు ప్రాంతంలో భారత సైన్యం ఇప్పుడు మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. చైనా బలగాలకు గట్టి షాక్ ఇస్తూ ఇప్పటికే ఈ సరస్సు దక్షిణ ప్రాంతంలో మూడు కీలక పర్వత ప్రాంతాలను భారత బలగాలు అధీనంలోకి తెచ్చుకుంది.
మరో వైపు భదౌరియా చైనాతో ఉద్రిక్తతల దృష్టా అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లోని వాస్తవాధీన రేఖ వెంబడి వైమానిక దళం యుద్ధ సన్నద్ధతను సమీక్షించినట్లు అధికారులు తెలిపారు.
తూర్పు లడఖ్ ప్రాంతంలోని ప్యాంగ్యాంగ్ లేక్ తూర్పు ప్రాంతంలో కొన్ని వ్యూహాత్మక ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడానికి చైనా సైన్యాలుచేసిన ప్రయత్నాలు విఫలమైన దృష్టా తలెత్తిన పరిస్థితుల దృష్టా పూర్తి అప్రమత్తగా ఉండాలని వైమానిక బలగాలను ఆయన ఆదేశించినట్లు అధికార వర్గాలు వెల్లడించారు.
షిల్లాంగ్ ప్రధాన కేంద్రంగా పని చేస్తున్న ఈస్ట్రన్ ఎయిర్ కమాండ్ సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్‌లలోని వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న సున్నిత ప్రాంతాలతో పాటుగా ఈ ప్రాంతంలోని వివిధ ప్రాంతాల గగన తల రక్షణ వ్యవహారాలను చూస్తుంది.