కిషన్ రెడ్డితో లడఖ్ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్ భేటీ 

భారత్‌-చైనా మధ్య తూర్పు లడఖ్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితుల నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. చైనా దురక్రమణను తిప్పికొట్టేందుకు భారత సైన్యం సిద్ధమవుతోంది. దీనిలో భాగంగానే ప్రస్తుతం లడఖ్‌లో నెలకొని ఉన్న పరిస్థితులను వివరించేందుకు లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ రాధాకృష్ణా మాథూర్‌ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డితో అత్యవసర భేటీ అయ్యారు.

వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి చైనా దుశ్చర్యను కేంద్ర మంత్రికి వివరించారు. గల్వాన్‌ లోయ హింసాత్మక ఘటన అనంతరం గత నెలలో ఇరు దేశాల సైనిక అధికారుల మధ్య జరిగిన సైనిక ఒప్పందాన్ని చైనా ఉల్లంఘించినట్లు కిషన్‌రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. తూర్పు లడఖ్ ప్యాంగ్‌యాంగ్ త్సో‌ సరస్సు ప్రాంతాల్లో చైనా దళాల కదలికల గురించి నివేదించారు.  

హోంమంత్రి అమిత్‌ షా అనారోగ్య కారణంగా ప్రస్తుతం విధులకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. సోమవారం ఉదయమే డిశ్చార్జ్‌ అయ్యారు. వైద్యుల సూచలన మేరకు విధులకు దూరంగా ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎస్‌‌కే మాథూర్‌ కిషన్‌రెడ్డితో భేటీ అయ్యారు.