లడఖ్ సరిహద్దులో పోటాపోటిగా యుద్ధ ట్యాంకులు 

లడఖ్ సరిహద్దులో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్యాంగాంగ్ త్సో సరస్సు ప్రాంతంలో చైనా భారీగా యుద్ధ ట్యాంకులు, ఆయుధాలను మోహరించింది. దీంతో భారత్ కూడా పోటాపోటీగా యుద్ధ ట్యాంకులను రంగంలోకి దించింది.

దీంతో ఆ ప్రాంతంలో ఇరు దేశాల యుద్ధ ట్యాంకులు దాడులు చేసుకునేంత రేంజ్‌లో ఉన్నట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. ఆగస్టు 29-30 తేదీల్లో చైనా మరోసారి దుస్సాహసానికి ప్రయత్నించిన సంగతి తెలిసిందే.

ప్యాంగాంగ్ సరస్సు వద్ద ఉన్న భారత్ సైనిక పోస్టు వద్దకు సుమారు 200 మంది చైనా సైనికులు ఆగస్టు 29 రాత్రి 11 గంటలకు వచ్చారు. సరిహద్దులోని ఎల్ఏసీ వద్ద భారత్ భూభాగంలోకి వచ్చేందుకు ప్రయత్నించారు.

అయితే వారి రాకను పసిగట్టిన ఇండియన్ ఆర్మీ దీటుగా జవాబిచ్చింది. తోపులాటకు దిగిన చైనా సైనికులను నిలువరించింది. దీంతో కొన్ని గంటల పాటు అక్కడ ఉన్న చైనా సైనికులు చివరకు వెనక్కిమళ్లారు.

కాగా, అక్కడి కాలా టాప్ శిఖర ప్రాంతాన్ని భారత్ ఆర్మీ స్వాధీనం చేసుకున్నది. ఈ నేపథ్యంలో లడఖ్ ప్రాంతంలో వ్యూహాత్మక ప్రాంతాలపై కన్నేసిన చైనా మరోసారి ఉద్రిక్తతలు పెంచేందుకు ప్రయత్నిస్తున్నది. భారత సైన్యం ఉన్న కాలా టాప్‌కు సమీపంలోని చుషుల్ ప్రాంతంలో భారీగా యుద్ధ ట్యాంకులు, ఆయుధాలను మోహరించింది.

దీంతో ప్రతిగా భారత్ కూడా భారీగా యుద్ధ ట్యాంకులు, ఆయుధ సంపత్తిని అక్కడికి తరలించింది. ఇప్పటికే అక్కడ పర్వత యుద్ధాల్లో ఆరితేరిన సుక్షిత సైనికులను భారత్ మోహరించింది. భారత్ ఆర్మీ డామినెంట్ ప్రాంతాల్లో ఉండటంతో యుద్ధ ట్యాంకులతో చేరిన చైనా సైనికులు ముందుకు కదలకుండా నిలిచిపోయినట్లు సమాచారం.

ఒకవైపు ప్యాంగాంగ్ సరస్సు వద్ద చైనా, భారత్ మధ్య ఉద్రిక్తతలు నెలకొనగా మరోవైపు మంగళవారం కూడా ఇరు దేశాల మధ్య సైనికపరమైన చర్చలు కొనసాగాయి. మోల్డోలో బ్రిగేడ్ కమాండర్ స్థాయిలో చర్చలు జరిగాయి.