చైనా పాల్గొంటున్న రష్యా సైనిక విన్యాసానికి భారత్ దూరం 

 
వచ్చే నెలలో రష్యాలో జరుగనున్న బహుళజాతి సైనిక విన్యాసం కవ్కాజ్-2020 లో భారత సైన్యం పాల్గొనడంలేదు. కవ్కాజ్ కు తమ బృందాన్ని పంపేది లేని భారత రక్షణ మంత్రిత్వ శాఖ స్పష్టంచేసింది. అందుకు కరోనాను కారణంగా చెప్పినప్పటికీ రష్యాతో పాటు చైనా, పాకిస్థాన్ దళాలు కూడా అందులో పాల్గొనబోవడమే అందుకు కారణంగా తెలుస్తున్నది. 
 
“రష్యా, భారతదేశం ప్రత్యేకమైన వ్యూహాత్మక భాగస్వాములు. రష్యా ఆహ్వానం మేరకు భారత్ అనేక అంతర్జాతీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నది. అయినప్పటికీ కొవిడ్-19 కారణంగా సైనిక విన్యాసాలతో ఇబ్బందులు ఉన్నందున ఈ ఏడాది నిర్వహిస్తున్న కవ్కాజ్-2020 లో పాల్గొనకూడదని భారత ప్రభుత్వం నిర్ణయించింది” అని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒకరు చెప్పారు.
 
జూన్ 15 న తూర్పు లడఖ్ పరిధిలోని గల్వాన్ లోయలో భారత్-చైనా ఘర్షణలో 20 మంది భారతీయ జవాన్లు ప్రాణాలు కోల్పోగా.. అనేక మంది చైనా సైనికులు మరణించారు.  గాయపడ్డారు.  అప్పటి నుండి చైనా ధోరణుల పట్ల భారత్ తన అసమ్మతిని వీలైన చోటల్లా తెలుపుతూనే ఉంది. 
 
కాగా, షాంఘై సహకార సంస్థ రక్షణ మంత్రుల సమావేశానికి సెప్టెంబర్ 4-6 తేదీలలో రక్షణ మంత్రి రష్యాను సందర్శించనున్నారని, అయితే భారత ప్రతినిధి తన చైనా ప్రత్యర్థితో ఎలాంటి చర్చలు జరిపే అవకాశం లేదని ఆయా వర్గాలు తెలిపాయి. 
 
కవ్కాజ్ -2020 కోసం సెప్టెంబరులో దక్షిణ రష్యాకు సుమారు 200 మంది సిబ్బందితో ట్రై-సర్వీసెస్ విన్యాసంలో పాల్గొనడానికి రష్యా భారతదేశాన్ని ఆహ్వానించింది. దక్షిణ రష్యాలోని ఆస్ట్రాఖాన్ ప్రావిన్స్‌లో ఈ  విన్యాసం జరుగనున్నది. ఈ సైనిక విన్యాసంలో  షాంఘై సహకార సంస్థ, మధ్య ఆసియా దేశాల సభ్య దేశాలు పాల్గొంటాయి.