అధికారికంగా విమోచన దినం.. బిజెపి వత్తిడి 

సెప్టెంబరు 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని కోరుతూ  కేసీఆర్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని బీజేపీ రాష్ట్ర శాఖ నిర్ణయించింది. ఇందు కోసం వివిధ కార్యక్రమాలు చేపట్టనుంది. 

పక్షం రోజుల పాటు జరిగే కార్యక్రమాలలో గవర్నర్‌ నుంచి తహసీల్దార్‌ వరకు దశలవారీగా వినతిపత్రాలు  అందిస్తారు.  ఈ వినతి  పత్రాలలో   విమోచన దినంను   ప్రభుత్వం   అధికారికంగా జరపాలని కోరడంతో పాటు విమోచన ఉద్యమాన్ని  పాట్యంశములలో చేర్చాలని,  పోరాటాలు   జరిగిన ప్రాంతాలను స్మృతి కేంద్రాలుగా అభివృద్ధి చేయాలనికోరనున్నారు.

అదే విధంగా మేధావులు, కళాకారులతో రౌండ్ టేబుల్ సమావేశాలు, వర్చ్యువల్ బహిరంగ సభ, ఇతర నిరసన కార్యక్రయాలు కూడా చేబడతారు. ఆదివారం జరిగిన పార్టీ పదాధికారుల సమావేశంలో ఈ కార్యక్రమం రూపొందించారు.

కాగా, త్వరలో జరిగే ఎమ్యెల్సీ, జీహెచ్‌ఎంసీ, దుబ్బాక ఉప ఎన్నికల సన్నద్ధతపై కూడా చర్చించారు. పార్టీ అభ్యర్థిగా ఎవరిని ప్రకటించినా కలిసికట్టుగా పనిచేయాల్సిందేనని నిర్దేశించారు. పార్టీ బలోపేతం కోసం చేపట్టాల్సిన చర్యలపై అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్ సలహాలు, సూచనలు తీసుకున్నారు.

జాతీయ నాయకత్వం లక్ష్యాలను ఆయన పదాధికారులకు వివరించారు. పార్టీ అనుబంధ విభాగాలు చేపట్టాల్సిన కార్యక్రమాలపై నిర్దేశించారు. కేంద్ర పార్టీ, నాయకత్వం సూచనలు, సలహాలు స్వీకరిస్తూ 2023లో ప్రజాస్వామ్య తెలంగాణ కోసం రాష్ట్రంలో బిజెపిని అధికారంలోకీ తీసుకురావాల్సిన గురుతర బాధ్యత అందరిపై ఉందని, ఇందుకు కలసికట్టుగా పనిచేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేసేందుకు కలిసికట్టుగా కృషిచేయాలని పదాధికారులకు పిలుపునిచ్చారు. కేంద్ర పథకాలపై ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని, తెలంగాణ అభివృద్ధి కోసం మోదీ ప్రభుత్వం ఇతోధికంగా అందిస్తున్న సాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.