ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న తెలంగాణ 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవినీతి, కమిషన్ లకు అలవాటుపడి ప్రాజెక్టులు, అభివృద్ధి పనుల రూపురేఖలు మార్చి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు  బండి సంజయ్ కుమార్ కేంద్ర మంత్రులకు ఫిర్యాదు చేశారు.
 
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ ల‌తో భేటీ అయి  తెలంగాణ రాష్ట్రానికి దక్కాల్సిన నిధులు, పనులు, ప్రాజెక్టులపై చర్చించారు. వివిధ మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న అనేక కొత్త ప్రాజెక్టులకు విడుదల చేస్తున్న నిధులను త్వరగా విడుదల చేయాలని సంజయ్ విజ్ఞ‌ప్తి చేశారు. 
 
నిధులు సమయానుకూలంగా అందించకపోవడంతో అనేక అభివృద్ధి పనులు, కొత్త ప్రాజెక్టులు కుంటుపడుతున్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తమ వాటాను సకాలంలో చెల్లించేలా ఒత్తిడి తీసుకురావాలని కేంద్ర మంత్రులను కోరారు.  

తెలంగాణ రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్న లక్ష్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ విషయంలో రైతుల ప్రయోజనాల గురుంచి చర్చించామ‌ని మీడియాకు తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన రైల్వే కొత్త ప్రాజెక్టులు, పెండింగ్ ప్రాజెక్టుల పురోగతి తదితర అంశాలపై చర్చించామని చెప్పారు. 

ముఖ్యంగా నూతనంగా చేపట్టనున్న హసన్ పర్తి-కరీంనగర్ రైల్వే లైను ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయాలని అడిగాన‌ని తెలిపారు. కరీంనగర్ పట్టణం తీగలకుంటపల్లిలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని, కరీంనగర్-నిజామాబాద్ రెండో లైను నిర్మాణం చేపట్టాలని కేంద్ర రైల్వే సహాయ శాఖ మంత్రికి వినతిపత్రం స‌మ‌ర్పించ‌గా మంత్రి దీనికి సానుకూలంగా స్పందించాన‌ని చెప్పారు.