బిజెపి ఎమ్యెల్యే రాజాసింగ్ కు ఉగ్రవాద ముప్పు!

బిజెపి శాసన సభ్యుడు రాజాసింగ్ కు ఉగ్రవాదుల నుండి ముప్పు ఉందా? ఉన్నదని హైదరాబాద్ పోలీసులు చెబుతున్నారు. అందుకనే ఆయనకు భద్రతను పెంచారు. కొద్ది రోజుల క్రితం పట్టుబడిన టెర్రరిస్టుల నుండి సేకరించిన జాబితాలో రాజాసింగ్ పేరు బయటపడింది. 
 
దీంతో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. గతంలో మాదిరిగా టు వీలర్ వాహనంపై తిరుగవద్దంటూ రాజసింగ్‌కు పోలీసులు తెలిపారు. గతంలో మాదిరిగా పరిస్థితులు లేవని జాగ్రత్తగా ఉండాలంటూ రాజాసింగ్‌కు పోలీసులు స్పష్టం చేశారు. 
 
ప్రభుత్వం కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనంలోనే ప్రయాణించాలని పోలీసులు కోరారు. ఈ విషయాలను పేర్కొంటూ ప్రత్యేకంగా లేఖను రాజాసింగ్‌కు  సౌత్ జోన్ డీసీపీ అందజేశారు.
 
లేఖపై స్పందించిన ఎమ్మెల్యే రాజాసింగ్ తనకు ఎవరి ద్వారా ప్రాణహాని ఉందో పోలీసులు స్పష్టం చేయాలని కోరారు.  ఈ విషయమై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు రాష్ట్ర హోంమంత్రికి లేఖ రాయనున్నట్లు చెప్పారు. 
 
తన ఇంటి పరిసరాలలో అద్దెకు ఉంటున్న వారి వివరాలను సేకరిస్తున్నారని, పోలీసులు తన సిబ్బందికి ఆయుధాలను కూడా మార్చారని రాజాసింగ్ తెలిపారు.