ఒక ఎకరం కూడా సాగుచేయని కాళేశ్వరం 

రూ. 1.14 లక్షల కోట్లతో కేసీఆర్ ప్రభుత్వం ఆర్భాటంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నీటి ద్వారానే రాష్ట్రంలో సాగు విస్తీర్ణం కోటి ఎకరాలు దాటినట్లు ప్రచారం చేసుకొంటున్న వరుసగా రెండో ఏడాది, ఈ సంవత్సరం కూడా  కాళేశ్వరంతో ప్రభుత్వం ఒక్క ఎకరం ఆయకట్టు నైనా ప్రతిపాదించలేదు. 

ఎగువన కురిసిన వర్షాలతో ఈసారి ఎస్సారెస్పీ కళకళలాడుతుండగా ఇటు ఎల్లంపల్లి దిగువన గోదావరి పోటెత్తింది. దీంతో కాళేశ్వరం నుంచి ఎల్లంపల్లి వరకు లిఫ్ట్ చేసిన 16 టీఎంసీల నీళ్లు మళ్లీ గేట్లు ఎత్తి గోదాట్లోకే వదిలేశారు. అరకోటి ఎకరాల భూమికి నీళ్లిస్తామని కడుతున్న ఈ ప్రాజెక్టుకు వరుసగా రెండో ఏడాది అదే పరిస్థితి. 

లింక్–1 నుంచి ఎల్లంపల్లికి నీళ్లను ఎత్తిపోయాలనే ఆరాటమే తప్ప అక్కడ ప్రతిపాదించిన 30 వేల ఎకరాలకు నీళ్లిచ్చే కాల్వల పనులు చేపట్టలేదు. లింక్–2లో ఎకరం కూడా ఆయకట్టు లేదు. లింక్–4లో కొండ పోచమ్మ వరకు నీటిని ఎత్తిపోసినా రిజర్వాయర్లు, చెరువులు నింపడం మినహా నీళ్లు ఇచ్చే డిస్ట్రిబ్యూటరీలు రెడీ కాలేదు. మల్లన్న సాగర్ నిర్మాణం కాక దానికింద ఆయకట్టుకు ఎప్పటికి నీళ్లొస్తాయో ప్రశ్నార్థకంగా మారింది.  

ఈ ఏడాది పంటలకు పాత ప్రాజెక్ట్ లే ప్రాణాధారం    అవుతున్నాయి. భారీగా కురిసిన వర్షాలు, బావులు, బోర్లు, పంపు సెట్లే రైతులను ఆదుకున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఈ వానా కాలంలో రికార్డు స్థాయిలో 1.26 కోట్ల ఎకరాల్లో పంటలు సాగులోకి వచ్చినట్లు వ్యవసాయ శాఖ ప్రకటించింది. 

ఇందులో సాగునీటి ప్రాజెక్టుల ద్వారా సాగులోకి వచ్చిన ఆయకట్టు కేవలం 41 లక్షల ఎకరాలు మాత్రమే. అంటే మూడో వంతులోపే (32 శాతం మాత్రమే). మిగతా 68 శాతం భూములకు వర్షాలు, భూగర్భ జలాలు, చెరువులు, కుంటల నీరే ఆధారమైంది. 

జూన్ నుంచి ఇప్పటివరకు సాధారణం కంటే 46 శాతం ఎక్కువ వర్షాలు కురిశాయి. ఈ సీజన్లో 560.4 మి.మీ. సాధారణ వర్షాపాతం అంచనా వేయగా ఇప్పటికే 819 మి.మీ. నమోదైంది. 14 జిల్లాల్లో భారీగా వానలు కురవగా, 11 జిల్లాల్లో అధికంగా, 8 జిల్లాల్లో సాధారణ వర్షపాతం రికార్డయింది. దీంతో అన్ని జిల్లాల్లోనూ పంటలకు అనువైన వాతావరణం నెలకొనడం సాగుకు కలిసొచ్చింది.