కన్యాకుమారి ఎంపీ వసంతకుమార్ కన్నుమూత 

తమిళనాడు కన్యాకుమారి లోక్‌సభ సభ్యుడు వసంతకుమార్ కన్నుమూశారు. 70 సంవత్సరాల వసంత్‌కుమార్ కరోనాతో చెన్నై అపోలో ఆసుపత్రిలో ఆగస్ట్ పదిన చేరారు. ఆయన్ను కాపాడేందుకు డాక్టర్లు చేసిన యత్నాలు ఫలించలేదు. వసంత్ కుమార్ ప్రస్తుతం తమిళనాడు కాంగ్రెస్ పార్టీకి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు. 
1950 ఏప్రిల్‌ 14న జన్మించిన వసంతకుమార్‌ తొలుత ఒక చిన్నపాటి దుకాణంతో వ్యాపారంలోకి అడుగుపెట్టారు.  అంచలంచెలుగా ఎదుగుతూ వసంత్‌ అండ్‌ కో పేరున ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌ షోరూంను ప్రారంభించారు. ప్రస్తుతం ఈ సంస్థ తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో 64 శాఖలను నిర్వహిస్తోంది. తెలంగాణ గవర్నర్‌ తమిళసైకి వసంతకుమార్‌ దగ్గరి బంధువు. వసంతకుమార్‌ మృతిపట్ల ప్రధాని మోదీ, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ సంతాపం వ్యక్తం చేశారు.
ఇలా  ఉండగా,మాజీ ప్రధాని దేవెగౌడ పెద్ద కుమారుడు, మాజీ మంత్రి రేవణ్ణకు కరోనా సోకింది. టెస్టుల్లో ఆయనకు పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన్ను ఆసుపత్రిలో చేర్పించారు. రేవణ్ణ త్వరగా కోలుకోవాలంటూ కర్ణాటక ఆరోగ్యమంత్రి బి. శ్రీరాములు ట్వీట్ చేశారు.
 
రేవణ్ణ హొలెనారసిపుర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కూడా.  కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే ఎస్.అంగారా కూడా  కరోనా బారినపడ్డారు. వైద్యుల సూచనతో ఆయన హోం క్వారంటైన్‌లోకి వెళ్లినట్టు అధికారులు తెలిపారు. కర్ణాటకలో ఇప్పటికే ముఖ్యమంత్రి ఎడియూరప్పతో పాటు పలువురు మంత్రులు, ప్రతిపక్ష నేతలు డీకే శివకుమార్, సిద్ధరామయ్య కరోనా బారిన పడి కోలుకున్నారు. 
పంజాబ్‌లో కరోనా సోకిన ఎమ్మెల్యేల సంఖ్య 29కి చేరింది. వారిలో పలువురు తనను కలిసినవారు కావడంతో సీఎం అమరీందర్‌ సింగ్‌ క్వారంటైన్‌కు వెళ్లారు.
 
ఇలా ఉండగా, దేశ వ్యాప్తంగా  కొత్తగా 76,472 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 34,63,973 చేరింది. గడిచిన 24 గంటల్లో 1,021 మంది కరోనా బాధితులు మృతి చెందడంతో ఆ సంఖ్య 62,550కు చేరింది. వైరస్‌బారిన పడ్డవారిలో ఇప్పటివరకు 26,48,999 మంది కోలుకున్నారు. భారత్‌లో ప్రస్తుతం 7,52,424 యాక్టివ్‌ కేసులున్నాయని కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శనివారం విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. 
దేశంలో మూడో రోజూ వెయ్యిపైగా మరణాలు నమోద య్యాయి. వరుసగా రెండో రోజు 9 లక్షల పైగా పరీక్ష లు నిర్వహించినట్లు కేంద్రం తెలిపింది. గత రెండు వారాల్లోనే కోటిపైగా నమూనాలను పరీక్షించామని.. మొత్తం పరీక్షలు 3.94 కోట్లు దాటాయని ప్రకటిం చింది. రికవరీ రేటు 76.28కి చేరిందని వివరించింది.
కొవిడ్‌ను కట్టడి చేసినట్లు పేరున్న కేరళ, ఢిల్లీ సహా పలు చిన్న రాష్ట్రాల్లో కొన్ని రోజులుగా బాధితులు పెరగడం, మొదట్నుంచి కరోనా ఉధృతంగా ఉన్న మహారాష్ట్రలో 14 వేలు, ఆంధ్రప్రదేశ్‌లో 10 వేలపైనే కేసులు నమోదవుతుండటంతో జాతీయ గణాంకాలు పైపైకి వెళ్తున్నాయి.