ఎంబిబిఎస్ కోర్సులో కోవిడ్ పాఠ్యాంశం

ఎంబిబిఎస్ కోర్సులో అంటువ్యాధుల మహమ్మారుల నిర్వహణ కూడా ఓ కోర్సుగా చేర్చారు. కోవిడ్ 19 ప్రభావంతో వైద్య విద్యార్థులు ఇటువంటి మహమ్మారులను ఏ విధంగా ఎదుర్కొవల్సి ఉంటుంది? దీనిపై శాస్త్రీయ నిర్వహణ క్రమం అలవర్చుకోవడం కీలకంగా మారాయి. 

ఈ వ్యాధుల నిర్వహణతో పాటు సామాజిక, చట్టపరమైన అంశాలను, సంబంధిత ఇతర విషయాలను కూడా ఇప్పటి కోర్సుకు అనుబంధ పాఠ్యాంశంగా చేరుస్తారు. కోవిడ్ 19 వంటి పలు మహమ్మారులతో తలెత్తే సవాళ్లకు డాక్టర్లను ఆది నుంచే సిద్ధంగా ఉంచేందుకు ఎంబిబిఎస్ కోర్సుకు సరికొత్త అంశాన్ని చేర్చే నిర్ణయం తీసుకున్నారు.

భారత అత్యున్నత స్థాయి వైద్య విద్య నియంత్రణ మండలి ఈ మేరకు కోర్సులో మార్పు తలపెట్టింది. దీనిని ఫైనల్ ఇయర్ అండర్ గ్రాడ్యుయెట్ ప్రోగ్రాంలో కోర్సుకు అనుబంధంగా చేరుస్తారని, దీని వల్ల పట్టా తీసుకుని వృత్తులోకి వెళ్లే వారికి పలు రకాల అంటువ్యాధుల చికిత్స, వాటి నివారణకు సంబంధించి మౌలిక అవగావహన ఏర్పడుతుందని భావిస్తున్నారు.

భారతీయ వైద్య పట్టభద్రుడు తన డాక్టర్ చదువు పూర్తి చేసుకున్న తరువాత వృత్తి ధర్మంలో భాగంగా మానవాళి సేవకు పాటుపడాలనే తపన పెరగడానికి ఈ నూతన అంశం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. భారతీయ వైద్య మండలి (ఎంసిఐ) విశిష్ట సదస్సు సందర్భంగా పాలకమండలి సభ్యులు ఈ పాఠ్యాంశం చేర్చడం గురించి ప్రస్తావించారు. 

కరోనా వైరస్ తలెత్తడం, అతి వేగంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించడం, తీవ్ర విషమ పరిణామాలు తలెత్తడంతో వైద్య వృత్తిని అభ్యసించేవారికి ఇటువంటి వైరస్‌ల నిర్వహణను సరైన రీతిలో తెలియచేయాల్సి ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకునే కోర్సులో దీనిని చేర్చినట్లు పాలక మండలి ఛైర్మన్ డాక్టర్ వికె పాల్ తెలిపారు.