రక్షణ రంగంలో ప్రైవేటు సంస్థలకు రెడ్‌ కార్పెట్‌ 

రక్షణ రంగంలో తమ ప్రభుత్వం రెడ్‌టేపిజాన్ని (అవినీతిని) రూపుమాపి ప్రైవేటు సంస్థలకు రెడ్‌ కార్పెట్‌ పరిచిందని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. రక్షణ ఉత్పత్తుల విషయంలో మనం స్వయం సమృద్ధి సాధించటం భారత్‌కు మాత్రమే కాకుండా ప్రపంచశాంతికి, ఆర్థిక ప్రగతికి కూడా ఎంతో అవసరమని స్పష్టం చేశారు. 

రక్షణరంగ పరిశ్రమ ప్రతినిధులతో  ఆన్‌లైన్‌లో నిర్వహించిన సదస్సులో ప్రధాని ప్రసంగించారు. ‘రక్షణ సామర్థ్యంలో భారత్‌ స్వయం సమృద్ధి సాధిస్తే హిందూమహాసముద్ర ప్రాంతానికి మరింత రక్షణ ఇవ్వగలదు. ఈ ప్రాంతంలోని మిత్రదేశాలకు రక్షణ ఉత్పత్తులను సరఫరా చేయగలదు. వ్యూహాత్మక సంబంధాలు మరింత బలపడతాయి’ అని ప్రధాని వివరించారు. 

రక్షణ ఉత్పత్తుల దిగుమతులపై నిషేధం అనేది కేవలం దిగుమతులను తగ్గించటానికే కాదని, దేశంలోని ప్రైవేటురంగానికి ప్రోత్సాహం ఇవ్వటానికి కూడానని  ప్రధాని పేర్కొన్నారు. త్వరలోనే మరిన్ని ఉత్పత్తుల దిగుమతిపై నిషేధం విధిస్తామని ప్రకటించారు. 

 మరోవైపు, యుద్ధంలో దేశీయ టెక్నాలజీ, ఆయుధాలతోపోరాడి గెలిస్తే కలిగే సంతృప్తి భద్రతా బలగాలకు మరేవిధంగానూ రాదని రక్షణదళాల అధిపతి (సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌ స్పష్టం చేశారు.