మసూద్ అజహర్‌‌కు కొనసాగుతున్న పాక్ ఆశ్రయం

పుల్వామా ఉగ్రదాడి చార్జిషీట్‌లో ప్రధాన నిందితుడైన జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజహర్‌‌కు ఆశ్రయాన్ని పాకిస్తాన్ కొనసాగిస్తోందని కేంద్రం ఆరోపించింది. ‘దాడి జరిగిన 14 ఫిబ్రవరి, 2019 నుంచి ఏడాదిన్నర విచారణ జరిగాక చార్జిషీట్‌ను ఫైల్ చేశాం. పుల్వామా దాడికి తమదే బాధ్యత అని జైషే మహ్మద్ తెలిపింది’ అని గుర్తు చేసింది. 
 
ఆ సంస్థ, దాని నాయకత్వం దాయాది పాకిస్తాన్‌లో ఉంది. విచారకరమైన విషయం ఏంటంటే చార్జిషీట్‌లో ప్రధాన నిందితుడైన మసూద్ అజహర్‌‌కు పాక్‌ ఆశ్రయాన్ని కొనసాగిస్తోంది. దీనికి సంబంధించి పాక్‌కు అవసరమైన సాక్ష్యాలను ఇచ్చాం. కానీ పాకిస్తాన్ తన బాధ్యతల నుంచి తప్పించుకుంటోందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ధ్వజమెత్తారు. 
 
2008 ముంబై ఉగ్రదాడికి సంబంధించి ఆధారాలను ఇచ్చినప్పటికీ పాక్ ఇప్పటి దాకా స్పందించలేదని కేంద్రం మండిపడింది. పుల్వామా దాడిలో ఉగ్రవాదుల చేతిలో 40 మంది సీఆర్‌‌పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. ఈ దాడికి సంబంధించి భారత్ రూపొందించిన చార్జిషీట్‌ను కొంటె యత్నంగా పాక్‌ తిరస్కరించింది. నమ్మదగిన ఆధారాలను సమర్పించడంలో భారత్ విఫలమైందని చెప్పింది.