అంబటిపై హైకోర్టులో వైసిపి కార్యకర్తల పిటిషన్‌

వైసిపి నేత, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఆయన సొంత నియోజకవర్గంలోని సొంత పార్టీ కార్యకర్తలే ఆయన అక్రమాలకు పాల్పడుతున్నారని అంటూ హైకోర్టును ఆశ్రయించడం గమనార్హం. 
 
రాజుపాలెం మండలం కోట నెలమపురి, కొండమోడు గ్రామాల్లో అక్రమ మైనింగ్‌ చేస్తున్నారని పేర్కొంటూ హైకోర్టు న్యాయవాది నాగరఘు పిటిషన్‌ వేశారు. రాజుపాలెం వైసిపి కార్యకర్తల తరుఫున ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. 
 
పిటిషన్‌ విచారణార్హతపై ధర్మాసనం ప్రశ్నలు లేవనెత్తగా అక్రమ మైనింగ్‌ జరుగుతున్నందునే పిటిషన్‌ వేశామని పిటిషనర్‌ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. మరోవంక ఉండగా  రాజకీయ దురుద్దేశంతోనే పిటిషన్‌ దాఖలు చేశారని, పిటిషన్‌కు విచారణార్హత లేదని ప్రభుత్వ తరుఫు న్యాయవాది వాదించారు. 
 
వైట్‌ లైమ్‌ స్టోన్‌, మొజాయిక్‌ చిప్స్‌ అక్రమ మైనింగ్‌ చేస్తున్నారని, దీంతో రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లుతోందని, ఈ వ్యవహారంపై సిబిఐతో విచారణ జరిపించాలని పిటిషనర్‌ కోరారు. 
 
వైసిపి కార్యకర్తలు వేస్తే ప్రజాప్రయోజన వ్యాజ్యం ఎలా అవుతుందని హైకోర్టు ప్రశ్నించగా న్యాయస్థానానికి పూర్తి వివరాలు చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని న్యాయవాది నాగరఘు చెప్పారు. ముఖ్యమంత్రికి, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోవడంతో కోర్టుకు రావలసి వచ్చిన్నట్లు తెలిపారు. 
 
దీనిపై స్పందించిన హైకోర్టు అక్రమ మైనింగ్‌పై వెంటనే నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించారు. తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేశారు.