హింసాత్మకంగా అమరావతి రైతుల నిరసన 

రాజధాని నిర్మాణం కోసం స్వచ్ఛందంగా ఇచ్చిన భూములకు ఇవ్వవలసిన కౌలు చెల్లించక పోవడంతో అమరావతి రైతులు నిరసనకు దిగడంతో వారిపై పోలీసులు నిర్ధాక్షిణ్యంగా బలప్రయోగంకు దిగారు. 

విజయవాడ ఏపీసీఆర్డీయే (ప్రస్తుతం ఏఎంఆర్డీయే) ప్రధాన కార్యాలయ ముట్టడికి ప్రయత్నించగా, పోలీసులు వారిని అడ్డుకొన్నారు. దీంతో రైతుల శాంతియుత ఉద్యమం హింసాత్మకంగా మారింది.

రైతులను పోలీసులు ఈడ్చిపారేశారు. వారిని లాగి వ్యానుల్లో పడేశారు. మహిళలను కాళ్లతో తన్నారు. వృద్ధులను లాగిపడేశారు. ‘మేం విధ్వంసం చేయడానికి రాలేదు. కౌలు ఇవ్వమని వేడుకోవడానికే వచ్చాం’ అని చేతులు జోడించినా లాఠీలు ఝళిపిస్తూ జులుం ప్రదర్శించారు. 

సుమారు 200మందికిపైగా రైతులను అదుపులోకి తీసుకుని, విజయవాడలోని వివిధ పోలీ్‌సస్టేషన్లకు తరలించారు. సాయంత్రం వరకూ అక్కడే ఉంచిన తర్వాత, స్టేషన్‌ బెయిలుపై విడిచిపెట్టారు. 

రాజధానికి భూములిచ్చిన రైతులకు ఇవ్వాల్సిన వార్షిక కౌళ్ల చెల్లింపునకుగాను సుమారు రూ.186 కోట్లను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మేలో ఉత్తర్వులిచ్చింది. జీవో వచ్చిందిగానీ, 3 నెలలైనా రైతుల బ్యాంక్‌ ఖాతాలకు జమ కాలేదు. 

ఈ విషయం ఎన్నిసార్లు కదిపినా సీఆర్డీయే అధికారుల్లో చలనం లేదు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఏఎంఆర్డీయేగా వ్యవహరిస్తున్న ఏపీసీఆర్డీయే ముట్టడికి అమరావతి జేఏసీ ఇచ్చిన పిలుపుమేరకు అమరావతి రైతులు బుధవారం ఉదయం విజయవాడ సీఆర్డీయే కార్యాలయానికి తరలి వచ్చారు.

గత ప్రభుత్వం రాజధాని కోసం తమ నుంచి భూములు తీసుకుందని, వాటికి పదేళ్లు కౌలు చెల్లిస్తామని ఒప్పందం చేసుకుందని కానీ ప్రస్తుత ప్రభుత్వం ఏడాది కౌలును ఇంత వరకు చెల్లించలేదని రైతులు నినాదాలు చేస్తూ ప్రశాంతంగా సీఆర్డీయే కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. 

రాజధానికి భూములిచ్చిన రైతులకు ఏటా మే లేదా జూన్‌ నెలల్లో వారి బ్యాంకు ఖాతాల్లో కౌలు డబ్బులు పడుతున్నాయని, గత ఐదు సంవత్సరాలుగా కౌలు డబ్బులు జమ అయ్యేవని, ప్రస్తుత సంవత్సరం ఆగస్టు నెలాఖరు అవుతున్నా ప్రభుత్వం కౌలు చెల్లించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

రాజధాని రైతుల రాకను తెలుసుకున్న పోలీసులు సీఆర్డీయే కార్యాలయానికి సుమారు 500 మీటర్ల దూరంలో ఉన్న వ్యాపార దుకాణాలను మూయించి, అన్ని మార్గాలను దిగ్బంధించారు. రైతులు కార్యాలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. అరెస్టులు చేశారు. 

 సీఆర్డీఏకు దారితీసే దారులన్నీ పోలీసులు కట్టుదిట్టం చేశారు. అయినా, వారిని ఛేదించుకొని కొంత మంది రైతులు సీఆర్డీయే కార్యాలయం వైపునకు వచ్చేందుకు ప్రయత్నించారు. ధర్నా చౌక్‌, పరిసర ప్రదేశాలకు చేరుకోగలిగారు.