పరీక్షా వాయిదా వద్దన్న 150 మంది ప్రొఫెసర్లు 

జేఈఈ-నీట్ పరీక్షలను వాయిదా వేయాలంటూ సోనియా ఆధ్వర్యంలో విపక్షాల భేటీ జరిగిన 24 గంటల్లోనే 150 మంది ప్రొఫెసర్ల బృందం ప్రధాని నరేంద్ర మోదీకి ఓ లేఖ రాసింది. ఇందులో భారత దేశానికి చెందిన వివిధ యూనివర్శిటీ ప్రొఫెసర్లతో పాటు విదేశాలకు చెందిన ప్రొఫెసర్లు కూడా ఉన్నారు.

జేఈఈ- నీట్ పరీక్షలను వాయిదా వేయడమంటే విద్యార్థుల జీవితాలతో చెలగాటాలాడడమే అని వారు హెచ్చరించారు. ‘‘తమ సొంత రాజకీయ ప్రయోజనం కోసం కొందరు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు’’ అంటూ లేఖలో ప్రొఫెసర్ల బృందం ఆ లేఖలో తీవ్రంగా ఆరోపించింది. 

‘‘యువకులే ఈ దేశానికి భవిష్యత్తు. కానీ కరోనా కారు మబ్బులు వారి కెరీర్‌పై కూడా పడ్డాయి. విద్యా సంస్థల ప్రవేశాల గురించి, తరగతుల గురించి వారిలో చాలా భయాలున్నాయి. వీటిని తొందరగా పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.’’ అని వారు స్పష్టం చేశారు.

 ప్రతి యేడాది లాగే ఈ యేడాది ఇంటర్మీడియట్ పరీక్షలను చాలా లక్షల మంది విద్యార్థులు రాశారని, తదుపరి లక్ష్యం కోసం వారందరూ ఎదురు చూస్తున్నారని మోదీ దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే ప్రభుత్వం జేఈఈ- నీట్ పరీక్షల తేదీలను ప్రకటించిందని గుర్తు చేశారు. 

ఒకవేళ వాటిని వాయిదా వేస్తే మాత్రం అత్యంత విలువైన విద్యా సంవత్సరాన్ని వారు కోల్పోయినట్టేనని ఆ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. ఆయా విద్యార్థులు కన్న కలలు సాకారమయ్యేలా చూడాలని, ఆ విషయంలో మాత్రం ప్రభుత్వం రాజీ పడకూడదని వారు ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు.

‘‘విద్యార్థుల భవిష్యత్తును జాగ్రత్తగా ఉంచడానికి 2020-21 సంవత్సరానికి చెందిన అకాడమిక్ కేలండర్‌‌ను రూపొందించడంలో ప్రభుత్వం పూర్తి జాగ్రత్తలు తీసుకుంటుంది. జేఈఈ- నీట్ పరీక్షలను కేంద్రం విజయవంతంగా నిర్వహిస్తుందని మేము గట్టిగా విశ్వసిస్తున్నాం’’ అంటూ ఆ ప్రొఫెసర్లు లేఖలో ఆశాభావం వ్యక్తం చేశారు.