మునిసిపల్ ఎన్నికలంటే టీఆర్ఎస్ లో వణుకు 

గ్రేటర్ హైదరాబాద్, వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలంటే టీఆర్ఎస్ నాయకులలో వణుకు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం అక్కడ ఎన్నికలు జరిగితే అసలుకే మోసమొచ్చే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. 

ఒకవైపు ప్రజల నుంచి వ్యతిరేకత, మరోవైపు నాయకుల మధ్య ఆధిపత్య పోరు ఉన్నట్టు నిఘావర్గాలు పార్టీ అధినేతకు నివేదించినట్లు తెలుస్తున్నది. ఈ మూడు కార్పొరేషన్ల పాలకవర్గాల పదవీ కాలం ముగియనున్ననేపథ్యంలో ఇప్పుడు ఎన్నికలు  వస్తే అధికార పార్టీకి వ్యతిరేక గాలులు వీచే అవకాశముందని చర్చ జరుగుతోంది. 

కరోనాను కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలమైందనే కోపంలో జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రజలు ఉన్నట్టు చెప్తున్నారు. వరంగల్ కార్పొరేషన్ లో నేతల  మధ్య అంతర్గ‌త పోరుకు తోడు తాజా వరదలు కొంపముచ్చే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. ఇక ఖమ్మం కార్పొరేషన్ లో పార్టీ రోజురోజుకు బలహీనపడుతోందని చెప్తున్నారు.

ఆర్నెల్లముందు నుంచే ఎన్నికలు జరిగే ప్రాంతంలో ప్రజల నాడిని తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సర్వేలు చేయిస్తుంటారు. హైదరాబాద్, వరంగల్, ఖమ్మంలో త్వరలో ఎన్నికలు జరుపవలసి ఉంది. ప్రభుత్వం గురించి అక్కడి ప్రజలు ఏం అనుకుంటున్నారో నివేదికలు తెప్పించుకున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. 

తాజా వరదలతో వరంగల్ వాసులు ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్నట్టు పార్టీ నేతలు  ఆందోళన చెందుతున్నారు. అక్రమ నాలాల విషయంలో ముందే చర్యలు తీసుకుని ఉంటే ప్రస్తుత ముంపు వాటిల్లేది కాదని అంటున్నారు. 2016లో కురిసిన భారీ వర్షాలతో వరంగల్ లో వరదలు వచ్చాయి. నాలాల ఆక్రమణల వల్లే వరదలు వచ్చాయని అధికారులు గుర్తించారు. 

అప్పుడే అక్రమ కట్టడాలను తొలగించి ఉంటే ఇప్పుడు ఇబ్బందులు వచ్చేవి కావని చెప్తున్నారు. మరోవైపు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, చీఫ్ విఫ్ వినయ్ భాస్కర్ మధ్య ఆదిపత్య పోరు నడుస్తోందని చర్చ ఉంది. ఎన్నికల నిర్వహణ బాధ్యత తనకు అప్పగించారని మంత్రి చేసిన హడావుడితో వినయ్ భాస్కర్ మనస్తాపం చెందినట్టు ప్రచారం జరిగింది. 

మంత్రి జోక్యంపై వినయ్ అసహనంలో ఉన్నట్టు కార్యకర్తలు చెప్తున్నారు. అందులో భాగంగానే ఈమధ్య ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ప్రగతిభవన్ లో మంత్రి కేటీఆర్ ను కలిసి అక్కడ నెలకొన్న పరిస్థితుల గురించి వివరించారు.