రూ 3 వేల కోట్లతో ‘మిషన్‌ కొవిడ్‌ సురక్ష

కరోనా టీకా అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలను తీసుకుంటున్నది. ఇందులో భాగంగా రూ. 3 వేల కోట్ల కార్పస్‌ ఫండ్‌తో ‘మిషన్‌ కొవిడ్‌ సురక్ష’ పేరిట ఓ ప్రత్యేక మిషన్‌ను చేపట్టనున్నట్టు తెలుస్తున్నది.
వ్యాక్సిన్‌ అభివృద్ధి, ఉత్పత్తి, సమర్థత, భద్రత, సరఫరా, అందుబాటు ధర తదితర అంశాలను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ఈ మిషన్‌ ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.
టీకాలను అభివృద్ధి చేస్తున్న సంస్థలకు అవసరమైన సాయాన్ని అందించేందుకు ఈ మిషన్‌ సాయపడుతుందని అధికారి ఒకరు పేర్కొన్నారు. 12 నుంచి 18 నెలల కాల పరిమితితో ఉండే ఈ మిషన్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ పరిధిలో ఉంటుందని, అయితే ఈ మిషన్‌ ప్రస్తుతం ప్రతిపాదనలోనే ఉన్నదని వివరించారు.
మరోవంక, దేశవ్యాప్తంగా ఉన్న పరిశోధన సంస్థలు, ఉన్నత విద్యాశాఖ తమ వద్ద ఉన్న ఆర్టీ-పీసీఆర్‌ పరీక్ష యంత్రాలను సమీపంలోని జిల్లా దవాఖానలు, కొవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తున్న ప్రభుత్వ ల్యాబ్‌లకు అందజేయాలని యూజీసీ కోరింది. ఫలితంగా కరోనా కట్టడిలో భాగంగా టెస్టుల సంఖ్యను మరింత పెంచడానికి వీలవుతుందని పేర్కొన్నది.