వచ్చే నెల నుంచి మెట్రో రైళ్లు నడిచే అవకాశం

వచ్చే నెల నుంచి దేశ వ్యాప్తంగా మెట్రో రైళ్లు నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్‌లాక్-4లో మెట్రో రైలు సర్వీసులను ప్రారంభించే అవకాశం ఉన్నదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పాఠశాలలు, కళాశాలలు మాత్రం మూసివుంటాయి. అలాగే, సినిమా హాళ్ళు వంటి రద్దీ ప్రదేశాలపై ఆంక్షలు కొనసాగుతాయి. మెట్రో రైలు సేవలను తిరిగి ప్రారంభించేందుకు తుది నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాలపై ఆధారపడి ఉంటుంది. 
 
ఢిల్లీ మెట్రో రైలు సర్వీసులు సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభించే అవకాశం ఉంది. కానీ, విస్తృతమైన ఆంక్షలతో సేవలు అందుతాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఢిల్లీలో కరోనా వైరస్ పరిస్థితి మెరుగుపడిందని వాదించిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అభ్యర్థన తరువాత ఢిల్లీ మెట్రోను ప్రారంభించే చర్చ ఊపందుకున్నది. 
 
“ఢిల్లీని భిన్నంగా చూడాలని కేంద్రాన్ని అభ్యర్థించాను” అని వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలతో జరిగిన ఆన్‌లైన్ సమావేశంలో కేజ్రీవాల్ చెప్పారు. “ఢిల్లీలో కరోనా వైరస్ పరిస్థితి మెరుగుపడుతున్నది. ఇతర నగరాల్లో మెట్రో రైళ్లను నడపకూడదనుకుంటే అలాగా కానివ్వండి. కానీ, ఢిల్లీలో మెట్రో రైలు సేవలను దశలవారీగా, ట్రయల్ ప్రాతిపదికన ప్రారంభించాలి” అని ఆయన పేర్కొన్నారు.
 
విమాన, రైలు సేవలు తిరిగి ప్రారంభమయ్యాయని, దీనివల్ల ప్రయాణీకులు రైలు లేదా విమానం లోపల గంటల తరబడి ఉండాలని కేంద్రం వాదించింది. విమాన ప్రయాణంతో పోల్చితే మెట్రో ప్రయాణం రెండు గంటలకు మించి సాగదు. అన్ని భద్రతా చర్యలను నిర్వహించగలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. 
 
జూలై 30 న వచ్చిన అన్‌లాక్ 3 మార్గదర్శకాలు రాత్రి కర్ఫ్యూను ముగించాయి. అలాగే, కంటైన్మెంట్ జోన్లలో లేని యోగా ఇన్స్టిట్యూట్‌లను ప్రారంభించడానికి అనుమతించాయి. విద్యాసంస్థలు, పబ్లిక్ పార్కులు లేదా సినిమా హాళ్ళు, పెద్ద సమావేశాలు జరిగే అన్ని ఇతర ప్రాంతాలలో పరిమితులు అమలులో ఉన్నాయి.