ఐదుగురు టిఎంసి నేతలకు ఇడి సమన్లు

పశ్చిమబెంగాల్‌ అధికార పార్టీ తృణమూల్‌ కాంగ్రెస్‌ (టిఎంసి)కి చెందిన ఐదుగురు నేతలకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నోటీసులు జారీ చేసింది. 2016 నారదా స్టింగ్‌ ఆపరేషన్‌ కేసుకు సంబంధించి ఐపిఎస్‌ ఆఫీసర్‌ను సస్పెండ్‌ చేశారు. 
 
లోక్‌సభ సభ్యులు సౌగతరాయ్, కాకలిఘోష్‌ దస్తిదార్‌, మాజీ లోక్‌సభ సభ్యుడు అప్‌రూప పోద్దార్‌, మంత్రి సువేందు అధికారి, టిఎంసి నేత రత్న ఛటర్జీల ఆస్తి వివరాలను సమర్పించాల్సిందిగా ఇడి కోరింది. కోల్‌కతా మాజీ మేయర్‌, రత్న ఛటర్జీ భర్త సోవన్‌ ఛటర్జీ కూడా ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. 
 
ఇడి నోటీసులపై త్వరలో స్పందిస్తామని సువేందు, సౌగతారాయ్ లు చెప్పారు. 2016 మార్చిలో టిఎంసి పార్టీకి చెందిన పలువురు సీనియర్‌ నేతలు నకిలీ సంస్థకు అనుకూలంగా భారీ మొత్తంలో నగదును తీసుకున్నట్లు నారద న్యూస్‌ పోర్టల్‌ వీడియోలను అప్‌లోడ్‌ చేయడంతో ఈ వివాదం ప్రారంభమైంది. 
 
కోల్‌కతా హైకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ 2017లో ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఈ కేసును సుప్రీంకోర్టు కూడా సమర్థించింది.