విజయన్ ప్రభుత్వంపై అవిశ్వాసం 

పినరయ్ విజయన్ ప్రభుత్వంపై ప్రతిపక్ష కాంగ్రెస్ సోమవారం అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. అవినీతిలో కూరుకుపోయారన్న విమర్శల నేపథ్యంలో ఎమ్మెల్యే వీడీ సతీషన్ అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించారు. దీనిపై చర్చించడానికి స్పీకర్ ఆమోదించారు కూడా.

బంగారం స్మగ్లింగ్ కేసు నేపథ్యంలో సీఎం పినరయ్ వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. తీర్మానంపై చర్చకు ఐదు గంటల సమయాన్ని స్పీకర్ కేటాయించారు.

ముఖ్యమంత్రి కార్యాలయాన్ని బంగారు స్మగ్లింగ్ మాఫియా హైజాక్ చేసిన్నట్లు  సతీసన్ ఆరోపించారు. ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ సస్పెన్షన్ కు గురైన మాజీ ఐటి కార్యదర్శిపై నెపం నెట్టి తప్పించుకోవాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. గత 15 ఏళ్ళల్లో కేరళలో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం చేపట్టడం ఇదే ప్రధమం. 

మరోవైపు బంగారం స్మగ్లింగ్ కేసుతో స్పీకర్‌కు సంబంధాలున్నాయని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత రమేష్ చెన్నితాలా ఆరోపించారు. ప్రభుత్వంతోపాటు ఆయనకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినందున స్పీకర్ ఆ కుర్చీలో కూర్చోకూడదని స్పష్టం చేశారు. అయితే నిబంధనల ప్రకారం దీని కోసం 14 రోజులు ముందుగా నోటీసు ఇవ్వాలని, అప్పుడే ఈ తీర్మానానికి సమ్మతిస్తానని స్పీకర్ చెప్పారు.

కాగా, దీనికి ముందు త్రివేండ్రం అంతర్జాతీయ విమానాశ్రయం కార్యకలాపాలు, పర్యవేక్షణను ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యానికి అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పున:సమీక్షించాలని కోరుతూ సీఎం పినరయి విజయన్ అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.