అరణ్య రోదనగా అమరావతి రైతుల ఉద్యమం 

వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వపు మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ, అమరావతిని మాత్రమే పూర్తిస్థాయిలో రాజధానిగా కొనసాగించాలని కోరుతూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన ఉద్యమం ఆదివారం 250 రోజులకు చేరుకొంది. ఈ సందర్భంగా రాజధాని రైతులు ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకువెళతామంటూ దీక్షా శిబిరాల వద్ద రణభేరీ మోగించారు. 
 
తుళ్లూరు, మందడంలో మహిళలు గరిటలతో కంచాలు మోగిస్తూ, రోడ్లపై కుట్టుమిషన్లను తెచ్చి బట్టలు కుట్టి నిరసన తెలిపారు. రాజధాని అమరావతి కేవలం ఒక కులానికే పరిమితం కాదంటూ చేతివృత్తిదారులు కుండలు, ఇస్త్రీపెట్టె, టైర్లబళ్లు, ట్రాక్టర్లు, ఎడ్లబళ్లను ప్రదర్శించారు. కొంతమంది గొర్రెలు, మేకలను దీక్షాశిబిరాల వద్దకు తీసుకువచ్చి నిరసన తెలిపారు. 
 
రాజధానిలో చేతివృత్తిదారులకు సరైన ప్రోత్సాహం లేకుండా పోయిందని వాపోయారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ నినాదాలు చేశారు. మందడం దీక్షాశిబిరం వద్ద రజకులు బట్టలు ఉతికి నిరసన తెలిపారు. అసైన్డ్‌ రైతులు దీక్షలు చేశారు. అమరావతి అన్నదాత ఆక్రందన కళారూపకం ప్రదర్శించారు. 
 
అన్నంపెట్టే రైతును రోడ్డుపాల్జేశారంటూ వెలగపూడిలో రైతులు, మహిళలు భిక్షాటన చేశారు. మహాత్మాగాంధీ విగ్రహానికి విన్నవించి దీక్షాశిబిరం వరకు పాదయాత్రగా వెళ్ళారు. తుళ్లూరు, పెదపరిమి, దొండపాడు, అనంతవరం, బోరుపాలెం, మల్కాపురం తదితర గ్రామాల్లో నిరసనలు జరిగాయి. 
 
ఇన్ని రోజులుగా వివిధ రూపాలలో నిరసనలు తెలుపుతున్నా ప్రభుత్వం కనీసం చర్చలకు కూడా ఆహ్వానించలేదు. కరోనా మహమ్మారి ఎదురైనా సాంఘిక దూరం పాటిస్తూ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. మొత్తం 29 గ్రామాల ప్రజలు ఉద్యమం చేస్తున్నా కొన్ని రాజకీయ పార్టీలు మొక్కుబడిగా మద్దతు తెలపడం తప్పా వారి గోడు అరణ్యరోదనగానే మిగిలి పోతున్నది. 
అందమైన రాజధాని కలల సాధన కోసం 33 వేల ఎకరాల భూములను ఇచ్చిన రైతులే ఇప్పుడు ఉద్యమం చేస్తున్నారు. కలలతో కాలక్షేపం చేసిన చంద్రబాబు నాయుడు పేరుకు రూ 45,000 కోట్ల వ్యయం కాగల నిర్మాణాలు ప్రారంభించినట్లు చెబుతున్నా వాటికోసం నాలుగోవంతు కూడా ఖర్చు పెట్టలేదు. పలు భవనాలు 20 శాతం నుండి 80 శాతం వరకు పూర్తి చేశారు. 
 
అయితే వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అటువైపే  చూడటం లేదు. ఒక సారి మునిసిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ ఆ కట్టడాలను చూడడం మినహా మరెవ్వరు చూడనే లేదు. రాజధాని స్వరూపంలో మార్పులు చేస్తే ఇప్పటికే నిర్మించిన భవనాలు ఏమి చేస్తారని హై కోర్ట్ ప్రశ్నించడంతో ముఖ్యమంత్రి ఒక సమీక్షా చేసి నిర్మాణంలో ఉన్న భవనాలను పూర్తి చేయమని ఆదేశించారు. 
 
అయితే అందుకు రూ 15,000 కోట్ల వరకు నిధులు అవసరమని అధికారులు చెబుతున్నారు. ఈ విషయమై ప్రభుత్వంలో స్పష్టత కనిపించడం లేదు. పైగా రాజధాని కోసం ఇచ్చిన భూములను ఇతర ప్రాంతాలలోని పేదలకు ఇళ్ల స్థలాలుగా ఇవ్వాలని జగన్ నిర్ణయించగా హైకోర్టు అడ్డు పడింది. 
 
స్వామి మాల దీక్షల తరహాలో నేటి నుండి రైతు దీక్ష చేస్తున్నారు. ఉదయం 11 గంటలకు ఉద్దండరాయునిపాలెంలోని  అమరావతి శంఖుస్థాపన  చేసిన పవిత్రస్థలి వద్ద అమరావతి రైతులు దీక్షను చేపట్టారు. 50 రోజుల వరకు దీక్ష కొనసాగనుంది. 251వ రోజు నుంచి 300 రోజు వరకు దీక్షలు కొనసాగనున్నాయి. దీక్షా కాలంలో ప్రతి ఒక్కరు మెడలో ఆకుపచ్చ కండువా  వేసుకోవాలి అనే నిబంధనను విధించారు
 
ఒక వంక కార్యనిర్వాహక రాజధానిని విశాఖపట్నంకు మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుండగా, ఇక న్యాయస్థానాల వైపే ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రామమందిరం కేసులో సుప్రీం కోర్ట్ లో సానుకూల తీర్పు పొందడంలో కీలక భూమిక వహించిన ప్రముఖ న్యాయవాది పరస్పరం రైతుల పక్షాన వాదించడానికి సుముఖత వ్యక్తం చేయడంతో వారిలో ఆశలు చెలరేగుతున్నాయి.