ఢిల్లీలో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం

ఐఎస్‌ఐఎస్‌ ఉగ్రవాదిగా అనుమానిస్తున్న వ్యక్తి నుంచి ఢిల్లీ పోలీసులు సుమారు తొమ్మిది కేజీల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ఆత్మాహుతి జాకెట్లు, ఇతర పదార్థాలు ఉన్నాయని ఢిల్లీ స్పెషల్‌ సెల్‌ డిఎస్‌పి పిఎస్‌.కుష్వా  వెల్లడించారు. 
 
పదిహేను కిలోల ఐఈడీ పేలుడు పదార్థాలను రెండు ప్రెషర్‌ కుక్కర్‌లో కూర్చారు! ఆ కుక్కర్లను ఢిల్లీలోని ఓ జనసమ్మర్దం గల ప్రాంతంలో పెట్టి పేల్చి.. మారణహోమాన్ని సృష్టించాలనేది ప్రణాళిక. బాంబుల తయారీ పూర్తయింది. వాటిని ఏ సమయంలో పేల్చాలో నిర్ణయించేందుకు టైమర్‌ను అమర్చడమొక్కటే మిగిలింది. 
 
ఇది ఐఎస్‌ ఉగ్రవాదులు పన్నిన కుట్ర! దీన్ని ఓ ఉగ్రవాది అమలు చేసే పనిలో ఉండగానే పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో పెద్ద ముప్పు తప్పింది!! ఈ మేరకు బాంబులతో సహా సదరు ఐఎస్‌ ఉగ్రవాదిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.
 అదుపులోకి తీసుకున్న వ్యక్తి 36 ఏళ్ల మహ్మద్‌ ముష్తాకీమ్‌ ఖాన్‌. అతడి స్వస్థలం.. యూపీలోని బలరాంపూర్‌ గ్రామం. అతడికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. ఊర్లోనే ఫ్యాన్సీ షాపు నిర్వహిస్తున్నాడు. ఓ ఐఎస్‌ సానుభూతిపరుడి పరిచయంతో ఉగ్రవాద కార్యకలాపాల వైపు ఆకర్షితుడయ్యాడు. 
 
ఐఈడీ బాంబులు, ఆత్మాహుతి బెల్ట్‌లు సిద్ధం చేయడం నేర్చుకున్నాడు. ఈ క్రమంలో సదరు ఐఎస్‌ సానుభూతి పరుడి సూచన మేరకు ఇటీవల పంద్రాగస్టు రోజున ఢిల్లీలో బాంబుదాడికి సిద్ధమయ్యాడు.
యూసఫ్‌ఖాన్‌ను సెర్చ్‌ ఆపరేషన్‌లో భాగంగా యుపిలోని అతని ఇంటికి తీసుకెళ్లామని తెలిపారు. అక్కడ తనిఖీలు నిర్వహించగా మూడు పాకెట్ల పేలుడు పదార్థాలు అమర్చిన ఒక జాకెట్‌, నాలుగు పాకెట్లు అమర్చిన మరో జాకెట్‌ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
 
ఇంకా పేలుడు పదార్థాలతో ఉన్న బెల్ట్‌ను కూడా సీజ్‌ చేశామని తెలిపారు. వీటితోపాటు ఎలక్ట్రిసిటీ వైర్ల బాక్స్‌ కలిగివున్న మూడు సిలిండ్రికల్‌ మెటల్‌ బాక్సులు, రెండు ఇతర బాల్‌బేరింగ్‌తో ఉన్న బాక్సులతో పాటు ఒక ఐఎస్‌ఐఎస్‌ జెండాను కూడా స్వాధీనం చేసుకున్నామని వివరించారు.
 
ఢిల్లీలో ఆగస్టు 15న పేలుళ్లు జరిపేందుకు 15 కిలోల ఐఈడీతో రెండు ప్రెషర్‌ కుక్కర్లను సిద్ధం చేశాడు. అయితే స్వాతంత్య్ర దినోత్సవం రోజు ఢిల్లీ వ్యాప్తంగా గట్టి భద్రత ఉండటంతో నగరంలోకి ప్రవేశించడం వీలుకాక వెనక్కి తగ్గాడు.
 
అదే పేలుడు సామగ్రితో ఢిల్లీలోనే ఓ జనసమ్మర్థం గల ఓ ప్రదేశంలో పేలుళ్లు జరపాలని పథకం రచించాడు. అయితే ఎక్కడ పేలుళ్లు జరపాలనుకున్నాడు? అతడిని పేలుళ్లకు పురమాయించిన ఐఎస్‌ సానుభూతి పరుడు ఎవరు అనేది పోలీసులు వెల్లడించలేదు.