ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూలధనం కొరత 

 
కరోనా సంక్షోభంతో ప్రభుత్వ రంగ బ్యాంక్‌ (పిఎస్‌బి)లు మూలధన కొరతను ఎదుర్కొంటున్నాయని అంతర్జాతీయ రేటింగ్‌ ఎజెన్సీ మూడీస్‌ తెలిపింది. వీటికి ప్రభుత్వ మద్దతు అవసరమని పేర్కొంది. వచ్చే రెండేళ్లలో రూ.2.1 లక్షల కోట్ల మూలధనం అవసరం ఉంటుందని మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ ఓ నివేదిక‌లో అంచనా వేసింది.
 
 వైరస్‌ విస్తృతి వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ వృద్థి మందగిస్తుందని, ఈ ప్రభావం బ్యాంక్‌ల ఆస్తుల నాణ్యతను దెబ్బతీస్తుందని, రుణాల జారీ వ్యయం పెరుగుతుందని మూడీస్‌ విశ్లేషించింది. వచ్చే రెండు మాసాల్లో రూ.1.9 లక్షల కోట్ల నుంచి రూ.2.1 లక్షల కోట్ల మూలధన మద్దతు అవసరమని మూడీస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, సీనియర్‌ క్రెడిట్‌ ఆఫీసర్‌ అల్కా అన్బరసు తెలిపారు. 
 
భారత బ్యాంకింగ్‌ రంగంలో పిఎస్‌బిల అత్యంత కీలక పాత్ర అయినందున వాటికి ఆర్థికంగా స్థిరత్వం కల్పించడానికి ప్రభుత్వం మద్దతును ఇవ్వాలని ఆమె సూచించారు. మూడీస్‌ రిపోర్ట్‌ ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ ప్రతికూల వృద్థిని చవి చూడనుంది. 
 
ఆర్‌బిఐ ఏక కాల రుణాల పునరుద్దరణకు అవకాశం కల్పిస్తే వచ్చే రెండేళ్లలో నిరర్ధక ఆస్తులు, రుణ వ్యయాలు పెరుగొచ్చు. ఇది ఇప్పటికే బలహీనంగా ఉన్న పిఎస్‌బిల లాభదాయకత, మూలధనాన్ని ఒత్తిడికి గురి చేయవచ్చు. 

మొండి బాకీల కోసం పిఎస్‌బిలు రూ.1 లక్ష కోట్లు కేటాయింపులు చెయ్యాల్సి రావొచ్చని మూడీస్‌ అంచనా వేసింది. దీంతో రుణాల జారీ 8-10 శాతం పెరుగుదలకు పరిమితం కావొచ్చు. దేశ ఆర్థిక వ్యవస్థ రికవరీ చుట్టూ అనిశ్చిత్తి నెలకొని ఉండటంతో పిఎస్‌బిలు మార్కెట్ల నుంచి కూడా నిధులు సమీకరించుకోవడం క్లిష్టంగా ఉంది. 
 
ఈ నేపథ్యంలో పిఎస్‌బిలకు మూలధనం మద్దతు కొనసాగాలి. అప్పుడే నిధుల కొరతను ఎదుర్కోగలవని.. లేనిచో ఆర్థిక వ్యవస్థ రికవరీలోనూ స్తబ్ధత చోటు చేసుకోనుందని మూడీస్‌ హెచ్చరించింది.