శ్రీశైలం విద్యుత్ భద్రతా అంశాలపై అనుమానాలు 

శ్రీశైలం పవర్‌ ప్రాజెక్టులో అగ్నిప్రమాదం పలు భద్రతాపరమైన అంశాలను వెలుగులోకి తెస్తున్నది. ఈ ప్రమాదం పట్ల నిపుణులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.  శ్రీశైలం ఎడమ గట్టు పవర్‌ ప్లాంట్ లో ఎగ్జాస్ట్ ఫ్యాన్స్‌ కు లోపలి నుంచి కాకుండా బయట నుంచి కూడా ఆల్టర్నేట్‌‌ పవర్‌ సప్లైకు ఒక డీసీ ఉంటుందని, అది ఎందుకు పని చేయలేదో అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎగ్జాస్ట్‌‌ ఫ్యాన్స్‌ 10 నిమిషాలు పనిచేసినా పవర్‌ ప్లాంట్ లో పొగ ఖాళీ అయ్యేదని చెబుతున్నారు.

శ్రీశైలం డ్యాం వెనకాల రివర్‌ సైడ్‌ రెండు పెద్ద జనరేటర్లు ఉంటాయి. ఇవి ఆటో సిస్టంలో పనిచేస్తాయివలం బల్బ్ ల కోసమే యూపీఎస్‌‌ ఉపయోగిస్తారు. అది కూడా పనిచేసినా   ఉద్యోగులంతా బతికేవాళ్లని భావిస్తున్నారు. పవర్‌ ప్లాంట్ లో మొత్తం నాలుగు ఎస్కేప్‌ చానళ్లు ఉన్నాయి.

లోపల చిక్కుకున్నవాళ్లు కిందికి దిగకుండా, వెనక్కి తిరిగి వెళ్లిపోతే బాగుండేది. కిందికి దిగడంతో చీకట్లో ఏం చేయాలో వారికి అర్థం కాలేదు. ఇంక్లాండ్‌ టన్నెల్‌ దాకా పైకి ఎక్కారు. అక్కడే వారు పడిపోయినట్లు అనిపిస్తోంది. అక్కడి వరకు రావడానికి చాలా శ్రమ తీసుకున్నారు. ఫైర్‌‌ మిషన్‌‌ ఉపయోగించలేదు.

ఫైర్‌ క్రాష్‌ కాగానే సీవోటీ సిలిండర్స్‌ అప్లై చేశారు. అక్కడే ఫైర్‌ మిషన్‌‌ ఉంటుంది. అది ఆన్ చేయాల్సింది. అది చేయడానికి ఆలోచన రాకపోయి ఉండవచ్చను కొంటున్నారు. టర్బైన్ల వద్ద విపత్తు యాజమాన్యంపై విశేష ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరాన్ని ఈ ప్రమాదం వెల్లడి చేస్తున్నది. ‌‌

ఈ ప్రమాదం దృష్ట్యా కాళేశ్వరం వద్ద కూడా అప్రమత్తతో ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాళేశ్వరంలో బాహుబలి పంపులు పెట్టడం, అవి కూడా చాలా ఎత్తుకు పోవలసి ఉండడంతో ఇటువంటి సమస్యలు తలెత్తే అవకాశం లేకపోలేదని పేర్కొంటున్నారు.

శ్రీశైలం ఎడమగట్టు పవర్‌ ప్లాంట్ లో ఉద్యోగులు తమ ప్రాణాలకు తెగించి వ్యవయరించని పక్షంలో మొత్తం ప్లాంట్ పేలిపోయి ఉండేదని భావిస్తున్నారు.

శ్రీశైలం పవర్‌ ప్రాజెక్టులో అగ్నిప్రమాదం నేపథ్యంలో నాగార్జునసాగర్‌ జలవిద్యుత్తు కేంద్రం భద్రతపై ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంటోంది. ఇప్పటికే రెండుసార్లు ఇక్కడ షార్ట్‌సర్క్యూట్‌ కాగా, ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. శ్రీశైలం తరహా ప్రమాదమే నాగార్జునసాగర్‌ కేంద్రంలో జరిగితే ఆస్తి నష్టం అధికంగా ఉంటుందని నిపుణులు చెపుతున్నారు.
 
అగ్ని ప్రమాదంలో ఉద్యోగులు ప్రాణాలు కోల్పోవడంతో జెన్‌కో, టాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు కన్నీటి పర్యంతమయ్యారు.   తన సుదీర్ఘ అనుభవంలో ఇంతటి విషాద సంఘటన ఎప్పుడూ జరగలేదని చెప్పారు. 
మంటలు ఎగిసి పడుతున్నప్పటికీ, ప్రాణాలకు ముప్పు అని తెలిసినా ప్లాంటును కాపాడడానికి ఉద్యోగులు సాహసోపేత ప్రయత్నం చేసి అంకితభావం చాటుకున్నారని కొనియాడారు. జాతి సంపదను కాపాడేందుకు ప్రయత్నించి వీర మరణం పొందారని నివాళులు అర్పించారు.