కేంద్ర మంత్రి జిఎస్‌. షెకావత్‌కు కరోనా

 దేశంలో కరోనా వేగంగా విజృంభిస్తోంది. ఇప్పటికే కేసుల సంఖ్య 28 లక్షలను దాటింది. తాజాగా కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. 
 
తనకు సన్నిహితంగా ఉన్న వారందరూ స్వీయ నిర్బంధంలోకి వెళ్లాల్సిందిగా ఆయీ సూచించారు. కొన్ని లక్షణాలు గమనించిన అనంతరం కరోనా పరీక్ష చేయించుకున్నానని, పాజిటివ్‌ నిర్థారణైందని తెలిపారు. వైద్యుల సూచనల మేరకు ఆస్పత్రిలో చేరినట్లు తెలిపారు. 
 
కాగా, సట్లెజ్‌, యమనా అంశంపై చర్చించేందుకు మంగళవారం షెకావత్‌, హర్యానా ముఖ్యమంత్రి ఎంఎల్‌ ఖతార్‌తో సమావేశమయ్యారు. కరోనాకు గురైన కేంద్ర మంత్రులలో ఆయన ఆరవవారు కావడం గమనార్హం. 
 
తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదంపై చర్చించిందుకు ఇద్దరు ముఖ్యమంత్రులతో కలసి ఈ నెల 25న అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరపాలని ఆయన నిర్ణయించారు. 
 
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, ఆయుష్‌ మంత్రి శ్రీపాద నాయక్‌, వ్యవసాయ శాఖ సహాయక మంత్రి కైలాష్‌ చౌదరి, అర్జున్‌ రామ్‌ మేగ్వాల్‌, ధర్మేంద్ర ప్రధాన్‌లకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్థారణైన సంగతి తెలిసిందే.ప్రస్తుతం అమిత్ షా శ్వాసకోశ సంబంధిత సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
 
ఇలా ఉండగా, గత 24 గంటల్లో 69,652 కొత్త కోవిడ్-19 కేసులు, 977 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 28,36,926కు పెరిగాయి. వీటిలో ప్రస్తుతం 6,86,395 యాక్టివ్ కేసులుండగా ఇప్పటివరకు 20,96,665 నయమై కోలుకున్నారు.
దేశవ్యాప్తంగా 53,866 మంది బాధితులు కరోనాతో మరణించిన్నటు తెలిపారు. ఆగస్టు 19 వరకు 3,26,61,252 మంది నమూనాలను పరీక్షించగా… గడిచిన 24 గంటల్లో 9లక్షల 18,470 మందికి కరోనా టెస్టులు చేసినట్టు ఐసిఎంఆర్ ప్రకటించింది.