సౌదీలో పాక్ ఆర్మీ చీఫ్ బజ్వాకు చుక్కెదురు 

కోపంతో ఉన్న సౌదీ అరేబియాను ఒప్పించడానికి వచ్చిన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వాకు తీవ్ర నిరాశ ఎదురైంది. తనను కలిసేందుకు పాక్ ఆర్మీ చీఫ్ కు సౌదీ అరేబియా  క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ సమయం ఇవ్వలేదు. 

దాంతో సౌదీ అరేబియా ఉప రక్షణ మంత్రి ప్రిన్స్ ఖలీద్ బిన్ సల్మాన్, మిలిటరీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ ఫయాద్ బిన్ హమీద్ అల్-రువాలితో సమావేశమై తిరుగు ప్రయాణం కట్టారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌ను సౌదీ అరేబియా గౌరవించే కార్యక్రమం కూడా వాయిదా పడింది.

పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషి ప్రకటనలతో ఆగ్రహించిన సౌదీ అరేబియా పాకిస్తాన్‌తో సంబంధాలను తెంచుకుంటుందని ప్రకటించింది. పాకిస్తాన్‌కు ముడి చమురు సరఫరా, రుణాలు ఇవ్వడం కూడా సౌదీ అరేబియా నిషేధించింది. 

ఈ దృష్ట్యా, సౌదీ అరేబియాను ఒప్పించడానికి పాకిస్తాన్ ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం జనరల్ బజ్వాతో పాటు ఐఎస్ఐ చీఫ్ జనరల్ ఫైజ్ హమీద్ ను పంపింది.

 కశ్మీర్ సమస్యపై సౌదీ అరేబియా నేతృత్వంలోని ఇస్లామిక్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఓఐసీ) భారత్‌పై చర్యలు తీసుకోలేదని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషి విమర్శించారు. ఈ విషయంలో ఓఐసీ ముందుకు రాకపోతే వారు ఆ ఇస్లామిక్ దేశాల సమావేశానికి ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌ను పిలువాలని బలవంతం చేస్తారని ఖురేషి ఒక విధంగా హెచ్చరిక చేశారు. 

గతేడాది జమ్ముకశ్మీర్ ప్రత్యేక హోదాను భారత్ రద్దు చేసినప్పటి నుంచి ఓఐసీ విదేశాంగ మంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేయాలని పాకిస్తాన్ పట్టుబడుతున్నది.

ఓఐసీ కి 57 మంది సభ్యులు ఉన్నారు. జమ్ముకశ్మీర్ ప్రత్యేక హోదాను రద్దు చేసినప్పటి నుంచి అంతర్జాతీయ మద్దతు పొందడానికి పాకిస్తాన్ అనేక ప్రయత్నాలు చేసింది.  కానీ అన్నింటా వైఫల్యాలు చవిచూడాల్సి వచ్చింది. 

ఇలాఉండగా, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ బజ్వా పర్యటన ముందస్తు ప్రణాళికతో జరిగిందని, కేవలం ఆర్మీకి సంబంధించిన విషయాలపై చర్చకే వీరి పర్యటన జరిగిందని పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధి మేజర్ జనరల్ బాబర్ ఇఫ్తీఖర్ వివరణ ఇచ్చుకున్నారు.