భారత్ సరిహద్దుల్లోకి చైనా ఫైటర్లు

అత్యంత అధునాతనమైన జె 20 యుద్ధ విమానాలను భారత్ సరిహద్దుల్లోకి మోహరించింది. భారత్‌తో తాము సవ్యమైన స్నేహబంధాన్ని ఎంచుకుంటామని చైనా విదేశాంగ ప్రతినిధి ప్రకటించిన రెండు రోజులకే  సరిహద్దుల్లోని తమ వైమానిక స్థావరంలోకి అత్యంత అధునాతన యుద్ధ విమానాలను చేర్చింది. 

ఇదంతా కేవలం తమ ఆత్మరక్షణ లేదా సైనిక తంత్రం, విమానాల తర్ఫీదుకు సంబంధించిన విషయం అని చైనా తాజాగా ఇప్పుడు సమర్థవాదనకు దిగింది. రెండు దేశాల మధ్య వాస్తవాధీన రేఖ (ఎల్‌ఎసి)కి కేవలం 130 కిలోమీటర్ల దూరంలోనే చైనాకు చెందిన హోటన్ వైమానిక యుద్ధ విమాన స్థావరం ఉంది. అక్కడికి రెంబడు జె 20 స్టెల్త్ విమానాలను అన్ని అస్తశస్త్రాలతో చైనా రక్షణ శాఖ చేర్చడం, గగనతలంలో ఇవి కొద్దిసేపు విహరించడం భారతీయ నిఘా సంస్థలు పసికట్టాయి.

ఇప్పటివరకూ ఇరుదేశాల మధ్య నెలకొన్న తీవ్రస్థాయి ఉద్రిక్తతల నివారణకు ఓ వైపు చైనా చర్చల ప్రక్రియ పేరిట సైన్యం ఉపసంహరణ ఘట్టానికి బ్రేకులు వేస్తూ వస్తోంది. మరో వైపు ఇప్పుడు ఫైటర్లను రంగంలోకి దింపడంతో తిరిగి ఈ డ్రాగన్ దేశం భారత్‌తో కావాలనే ఘర్షణకు కాలుదువ్వేలా ఉందని వెల్లడైంది. దీనిపై ఏం చేయాలనే అంశంపై భారత సైనిక ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు. 

ఈ ప్రాంతంలోని సైనిక విమాన స్థావరానికి యుద్ధ విమానాలను చేర్చిన విషయం ఇప్పుడు ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా నిర్థారించారు. అంతకు ముందు ఇక్కడ అనేక చైనా యుద్ధ విమానాలు సిద్ధంగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో గగనతలం ద్వారా భారత్‌ను దెబ్బతీసేందుకు చైనా రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు ప్రస్తుత పరిణామాలతో వెల్లడవుతోందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. జె 20, వీటికి తోడుగా జె 8, జె 16 యుద్ధ విమానాలను చైనా ఇక్కడికి చేర్చుకుని ఉంచింది.

ఇటీవలే భారతదేశం అత్యంత శక్తివంతమైన రాఫెల్ యుద్ధ విమానాలను సంతరించుకుంది. ఇవి శత్రువును అన్ని విధాలుగా దెబ్బతీసే సామర్థంతో ఉ న్నాయి. ప్రస్తుతం ఈ రాఫెల్స్ అంబాలా వైమానిక స్థావరంలో ఉన్నాయి. చైనా కదలికలను గుర్తించి ఆ దేశ ఫైటర్లకు తగు జవాబు ఇచ్చేందుకు ఈశాన్య భారతంలో నెలకొని ఉన్న ఎయిర్‌ఫోర్స్ సెంటర్‌కు రెండు మూడు రాఫెల్స్‌ను చేర్చాలని ముందుగానే నిర్ణయించారు.

ప్రస్తుతం చైనా ఫైటర్లు ఇక్కడికి చేరడంతో రాఫెల్ ఫైటర్లు కూడా ఈ స్థావరాన్ని చేరుకుంటాయని భావిస్తున్నారు. అత్యంత ఎతైన కొండ మంచు చరియల ప్రాంతంలో భారత దేశపు కాల్బలంతో తలపడటం చైనా బలగాలకు చాలా కష్టం అవుతుంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు వాయుసేన, క్షిపణులు, డ్రోన్లపై ఆధారపడి భారత్‌ను పూర్తి స్థాయిలో కవ్వించేందుకు చైనా రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు వెల్లడైంది. 

వైమానిక యుద్ధ విమానాల విషయంలో భారతదేశం కూడా ధీటుగానే ఉంది. భారత సైన్యానికి ఇప్పుడు అగ్రశ్రేణి యుద్ధ విమానాలు సుఖోయ్ 30, మిగ్ లు, సి17 రవాణా విమానాలు, నిఘా వేసి ఉంచడంలో ఆరితేరిన పి8 ఊ విమానం, చినూక్, అపాచీ హెలికాప్టర్లు కొండంత అండగా మంచుకొండల్లో అండగా నిలుస్తున్నాయి. ఇక మానవ రహిత విమానాలను లేహ్ వైమానిక స్థావరంలో సన్నద్ధంగా ఉంచారు.