రాజధాని అంశంలో కేంద్రంకు సంబంధం లేదు 

‘రాజధాని’ విషయంలో తన వైఖరి ఏమిటో కేంద్ర ప్రభుత్వం  మరోసారి హైకోర్టుకు స్పష్టతనిచ్చింది. రాజధాని ఎక్కడ ఉండాలన్న అంశం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని వ్యవహారమని పునరుద్ఘాటించింది. రాజధాని విషయంలో తమ పాత్ర ఏమీ ఉండదని తేల్చి చెప్పింది. 
 
సీఆర్‌డీఏని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చట్టం తెచ్చిందని, ఈ చట్టం రూపకల్పన సమయంలో కూడా తమను సంప్రదించలేదని హైకోర్టుకు కేంద్ర ప్రభుత్వం గుర్తు చేసింది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. 
 
వీటిపై విచారణ సందర్భంగా కౌంటర్‌ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తరఫున హోంశాఖ కార్యదర్శి లలిత టి.హెడావు కౌంటర్‌ దాఖలు చేశారు.  
 
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ’ఆంధ్రప్రదేశ్‌ వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి చట్టం’ చట్టాన్ని తెచ్చి అమరావతి మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ ఏరియాను శాసన రాజధానిగా, విశాఖపట్నం మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ ఏరియాను కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ ఏరియాను న్యాయ రాజధానిగా ప్రకటించింది. 
రాజధాని ఎక్కడ ఉండాలన్నది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని వ్యవహారం. అందులో కేంద్ర ప్రభుత్వం పాత్ర ఏమీ ఉండదని తెలిపింది.  వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని న్యాయ ప్రయోజనాల దృష్ట్యా తగిన ఉత్తర్వులు జారీ చేయాలని కోర్టును కోరింది.
2015 ఏప్రిల్‌ 23న అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని రాజధానిగా నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ  చేసింది.   ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్‌ 94 ప్రకారం కొత్త రాజధానిలో రాజ్‌భవన్, హైకోర్టు, సచివాలయం, శాసనసభ, శాసన మండలితో సహా ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం ప్రత్యేక ఆర్థిక సాయంలో భాగంగా నిధులు అందచేసిందని అంటూ ఆ వివరాలను కోర్టుకు కేంద్రం సమర్పించింది.