ఉగ్రవాదులకు బీజేపీ, ఆరెస్సెస్‌ నేతలే టార్గెట్  

భారత్‌పై పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు గురిపెట్టాయని, హిందూ జాతీయవాద సంస్థల నేతలను టార్గెట్‌గా చేసుకున్నాయని కేంద్ర నిఘా సంస్థ (ఐబీ) హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఈ విషయాన్ని తమిళనాడు పోలీసులు నిర్ధారించారు. 

బీజేపీతోపాటు.. ఆరెస్సెస్‌, ఏబీవీపీ, వీహెచ్‌పీ వంటి సంస్థలకు చెందిన ప్రముఖ నేతలను హత్య చేసేందుకు ఉగ్ర సంస్థలు కుట్రపన్నాయని ఐబీ హెచ్చరించింది.  భారత్‌లో అలజడికి ఏదో ఒకటి చేయాలంటూ ఉగ్రవాద సంస్థలపై ఒత్తిడి ఉందని, దీంతో స్లీపర్‌సెల్స్‌, ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐస్‌), ఇతర ఉగ్రవాద సంస్థలు హిందూ జాతీయవాద సంస్థలనేతల దినచర్యలపై నిఘా పెట్టాయని పేర్కొంది.

అలాంటి నేతలను గుర్తించి, వారికి భద్రత పెంచాలని, ఉగ్రదాడుల అవకాశాలను వారికి వివరించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ హెచ్చరికలతోనే 20 మంది ఉగ్రవాద సానుభూతిపరులను అరెస్టు చేసినట్లు తమిళనాడు పోలీసులు వెల్లడించాయిరు.

మరో హెచ్చరికలో విమానాశ్రయాలు, ఎయిర్‌ స్ట్రిప్స్‌, నౌకాశ్రయాలపై పాకిస్థాన్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ ఐఎ్‌సఐ ప్రేరేపిత తీవ్రవాద/నక్సల్స్‌ బృందాలు దాడులు చేసే ప్రమాదముందని ఐబీ పేర్కొంది. బంగ్లాదేశ్‌, మయన్మార్‌ సరిహద్దుల నుంచి చొరబాట్లకు ఉగ్రవాదులు, తీవ్రవాదులు ప్రయత్నాలు చేస్తున్నారని వెల్లడించింది.