సీబీఐకి సుశాంత్ మృతి కేసు

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసును సుప్రీంకోర్టు సీబీఐకి అప్ప‌గించింది. ఈ కేసులో మ‌హారాష్ట్ర పోలీసులు సీబీఐకి స‌హ‌క‌రించాలంటూ ఇవాళ అత్యున్న‌త న్యాయ‌స్థానం ఆదేశించింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ కేసులో విచార‌ణ నిర్వ‌హించిన ముంబై పోలీసులు త‌మ ద‌గ్గ‌ర ఉన్న అన్న వివ‌రాల‌ను సీబీఐకి అప్ప‌గించాల‌ని కోర్టు ఆదేశించింది. 

రియాపై ఎఫ్ఐఆర్ న‌మోదు చేయ‌డం న్యాయ‌బ‌ద్ద‌మైన‌దే అంటూ సుప్రీం పేర్కొన్న‌ది. ఈ కేసులో సింగిల్ బెంచ్ జ‌స్టిస్ హృషికేశ్ రాయ్ తీర్పును ఇచ్చారు. రాజ్‌పుత్ మ‌ర‌ణం కేసులో భ‌విష్య‌త్తులో ఎటువంటి కేసు న‌మోదు అయినావాటిని కూడా సీబీఐ చూసుకోవాల‌ని కోర్టు ఆదేశించింది.  

ముంబై, బీహార్ పోలీసుల మ‌ధ్య ఉన్న పెనుగులాట‌ను ప‌క్క‌న‌పెట్టిన కోర్టు  పాట్నాలో ఎఫ్ఐఆర్ న‌మోదు కావ‌డం న్యాయ‌బ‌ద్ద‌మే అంటూ కోర్టు చెప్పింది.  తీర్పు త‌ర్వాత మ‌హారాష్ట్ర అప్పీల్‌కు వెళ్లే ప్ర‌య‌త్నం చేసింది.. కానీ కోర్టు దాన్ని కొట్టివేసింది.

సుప్రీం ఇచ్చిన తీర్పును సుశాంత్ సోద‌రి శ్వేతా సింగ్ స్వాగ‌తించింది. బాలీవుడ్ న‌టుడు అనుప‌మ్ ఖేర్ కూడా సుప్రీం తీర్పును స్వాగ‌తించారు. సుశాంత్ మాజీ స్నేహితురాలు అంఖిత లోకాండే కూడా సుప్రీం తీర్పును స్వాగ‌తిస్తూ ట్వీట్ చేసింది.  రియా కోరింది, సుప్రీం అనుగ్ర‌హించింద‌ని న‌టుడు వివేక్ రంజ‌న్ అగ్నిహోత్రి ట్వీట్ చేశారు.

పాట్నాలో త‌న‌పై న‌మోదు అయిన ఎఫ్ఐఆర్‌ను ముంబైకి బ‌దిలీ చేయాల‌ని రియా సుప్రీంలో పిటిష‌న్ పెట్టుకున్న‌ది.  వాస్తవానికి ఆ అభ్య‌ర్థన‌పై ఆగ‌స్టు 11వ తేదీన విచార‌ణ జ‌రిగింది. కానీ జ‌స్టిస్ హృషికేశ్ రాయ్ నేతృత్వంలోని ఏక‌స‌భ్య ధ‌ర్మాస‌నం తీర్పును రిజ‌ర్వ్ చేసింది.   

సుశాంత్ మృతి కేసు మిస్ట‌రీగా మారిన విష‌యం తెలిసిందే.  సుశాంత్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నట్లు ముంబై పోలీసులు తేల్చినా ఆ కేసులో ప‌లు అనుమానాలు ఉన్నాయి.  ఎటువంటి ఎఫ్ఐఆర్ న‌మోదు చేయ‌కుండానే ముంబై పోలీసులు ఇప్ప‌టికే సుమారు 50 మంది బాలీవుడ్ ప్ర‌ముఖుల్ని ప్ర‌శ్నించారు.

అయితే ఈ కేసులో సుశాంత్ తండ్రి పిటిష‌న్ దాఖ‌లు చేయ‌డంతో కేసు కొత్త మ‌లుపు తిరిగింది. గ‌ర్ల్‌ఫ్రెండ్ రియాపై అనుమానాలు వ్య‌క్తం కావ‌డం కూడా ఆస‌క్తిగా మారింది.  సుశాంత్ అకౌంట్లో ఉన్న కోట్ల డ‌బ్బు ఎక్క‌డికి, ఎలా వెళ్లింద‌న్నది మ‌రింత మిస్ట‌రీగా మారింది. సుశాంత తండ్రి ఫిర్యాదు మేర‌కు బీహార్‌లో ఎఫ్ఐఆర్ న‌మోదు అయ్యింది. తొలుత రియా కూడా సీబీఐ విచార‌ణ కోరుతూ సుప్రీంను ఆశ్ర‌యించింది.

సుశాంత్ మృతి కేసు విచార‌ణ ముంబైలో జ‌ర‌గాల‌ని మ‌హారాష్ట్ర వాదిస్తున్న‌ది. సుశాంత్ జూన్ 14వ తేదీన బాంద్రాలోని త‌న ఇంట్లో ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు ముంబై పోలీసులు నిర్ధారించారు. కానీ త‌న కుమారుడి మ‌ర‌ణానికి రియానే కార‌ణ‌మంటూ సుశాంత్ తండ్రి పిటిష‌న్ దాఖ‌లు చేశారు.