సగం పడకలకు ప్రైవేట్ ఆసుపత్రుల వెనుకడుగు 

కరోనా రోగులకు సేవలు అందించడంలో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి రావడానికి ప్రైవేట్ హాస్పిటల్స్ విముఖత వ్యక్తం చేస్తున్నాయి. కోవిడ్ సేవల కొరకు ప్రతి హాస్పిటల్‌లో 50 శాతం పడకలు ఇచ్చేందుకు ఈనెల 13వ తేదిన స్వయంగా వైద్యారోగ్య మంత్రి ఈటల రాజేందర్ ముందు ఒప్పుకున్న  ప్రైవేట్ హాస్పిటల్స్ ఆ తర్వాత వెనకడుగు వేశాయి. దీనితో ఏమి చేయాలో దిక్కుతోచక ముఖ్యమంత్రి నిర్ణయానికి వదిలివేసిన్నట్లు తెలుస్తున్నది.
 
విధివిధానాలపై వైద్యశాఖతో భేటీ అవ్వాలని మంత్రి సూచన మేరకు ఈనెల 14వ తేదిన ఆరోగ్య శాఖ అధికారులకు, ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలకు ఓసారి చర్చలు జరిగినా అవి అర్ధంతరంగా ముగిశాయి. దీంతోనే ప్రైవేట్ యాజమాన్యాలు వెనకడుగు వేస్తున్నట్లు భావిస్తున్నారు. సోమవారం జరగాల్సిన చర్చలు రద్దు అవడానికి కూడా కారణం ఇదేనని తెలుస్తున్నది.
ప్రభుత్వం ఆధీనంలో ఉన్న 50 శాతం పడకలకు ఖచ్చితంగా ప్రతి రోజూ సాధారణ వార్డుకు రూ 4,000, ఐసియూకు రూ.7500, వెంటిలేటర్‌పై ఉంచితే రూ 9,000 చొప్పున తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఈ విధానంలో సిద్ధం లేకుంటే మరో ఫ్యాకేజీని కూడా వైద్యశాఖ ప్రతిపాదించింది.
దాని ప్రకారం 14 రోజులు సాధారణ వార్డులో చికిత్స పొందితే రూ.లక్ష, ఆక్సిజన్ వార్డుకు రూ.2 లక్షలు, ఐసియూ వార్డులో ఉంచితే రూ.3 లక్షలు తీసుకోవాలి. ఈ విధానంలో దీర్ఘకాలిక రోగులకు ఎన్ని సార్లు స్కానింగ్‌లు ఇతర ఖరీదైన మందులు వాడినా గరిష్ఠంగా రూ4 లక్షలకు మించకుండా తీసుకోవాలని సూచించింది.

ఈ పడకలను ఓ యాప్ ద్వారా తామే నింపుతామని వైద్యశాఖ పేర్కొంది. అయితే మిగతా 50 శాతం పడకలలో తమకు సంబంధం లేదని ఆరోగ్య అధికారులు తెలిపారు. తమ ఆసుపత్రుల్లో ప్రభుత్వం పెత్తనం ఉంటే ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందేమోనని ప్రైవేట్ ఆసుపత్రులు మొఖం చాటేస్తున్నట్లు భావిస్తున్నారు.