రైల్వే భద్రత కు డ్రోన్‌ ఆధారిత నిఘా వ్యవస్థ  

రైల్వే భద్రతను పెంచే కృషిలో భాగంగా డ్రోన్‌ ఆధారిత నిఘా వ్యవస్థ ను ప్రవేశ పెట్టనుంది. ఎక్కువ ప్రాంతాల్లో  తక్కువ మానవశక్తితో భద్రత చేపట్టాల్సిన సందర్భాల్లోడ్రోన్‌ నిఘా పరిజ్ఞానం అత్యంత కీలకంగా మారింది. మానవశక్తితో పోలిస్తే దీనికయ్యే వ్యయం తక్కువ.
రైల్వే స్టేషన్‌, ట్రాక్‌ సెక్షన్లు, యార్డులు, వర్క్‌షాపులు వంటి ప్రాంతాల్లో నిఘా కోసం, మధ్య రైల్వేలోని ముంబై డివిజన్‌ ఇటీవల రెండు నింజా యూఏవీలను కొనుగోలు చేసింది. డ్రోన్లను ఎగరవేయడం, నిఘా, నిర్వహణపై నలుగురు సభ్యుల ముంబయి ఆర్పీఎఫ్‌ బృందానికి శిక్షణ ఇచ్చారు.
ఈ డ్రోన్ల కెమెరాతో, ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఆయా ప్రాంతాలపై నిఘా ఉంచవచ్చు. ‘ఆటోమేటిక్‌ ఫెయిల్‌ సేఫ్‌ మోడ్‌’ ద్వారా వీటిని నిర్వహించవచ్చు. ఆగ్నేయ రైల్వే, మధ్య రైల్వే, రాయబరేలీలోని ఆధునిక బోగీల ఫ్యాక్టరీ, నైరుతి రైల్వే కోసం ఇప్పటివరకు తొమ్మిది డ్రోన్లను ఆర్‌పీఎఫ్‌ కొనుగోలు చేసింది. ఇందుకు రూ.31.87 లక్షలు వెచ్చించింది.
రూ.97.52 ఖర్చుతో మరో 17 డ్రోన్లను కొనడానికి ప్రతిపాదనలు ఉన్నాయి. ఇప్పటికే 19 మంది ఆర్‌పీఎఫ్‌ సిబ్బందికి డ్రోన్లను ఎగురవేయడం, నిర్వహణపై శిక్షణ ఇచ్చారు. వీరిలో నలుగురికి లైసెన్స్‌ కూడా వచ్చింది. మరో ఆరుగురు శిక్షణలో ఉన్నారు.
రైల్వే ఆస్తులు, ప్రాంత సున్నితత్వం, నేరస్తుల కార్యకలాపాలు వంటి అంశాల ఆధారంగా డ్రోన్లను రూపొందించారు. ‘ఆకాశ నేత్రం’లా డ్రోన్‌ వ్యవహరిస్తుంది. ఏదైనా అనుమానాస్పద కార్యకలాపం డ్రోన్‌ కంటబడితే, దగ్గరలోని ఆర్‌పీఎఫ్‌ కేంద్రానికి సమాచారం పంపి, అనుమానితులను అప్పటికప్పుడే అదుపులోకి తీసుకునేలా చేస్తుంది.
ఇదే తరహాలో, ముంబైలోని వాడిబందర్‌ యార్డులో నిలిపివుంచిన రైల్వే బోగీలో దొంగతనానికి ప్రయత్నించిన ఓ వ్యక్తిని రియల్‌ టైమ్‌లో డ్రోన్‌ పట్టించింది.
మరోవంక  రవాణా ఆదాయాన్ని పెంచుకునేందుకు ఇకపై డొమినోస్ పిజ్జా డెలివరీ మోడల్‌ను రైల్వేలు అవలంబించన్నట్లు తెలుస్తోంది. అంటే జాతీయ రవాణాదారు ఉత్పత్తులతో పాటు, వస్తువులను నిర్థిష్టకాలంలో రవాణా చేయడమే కాకుండా ఆలస్యం జరిగితే తగిన పరిహారం కూడా  రైల్యే శాఖ చెల్లించనుంది. ఈ పరిహారం గంటల ప్రాతిపదికన ఉంటుంది.