ఎపిలో మూడు లక్షలను దాటిన కరోనా కేసులు

ఎపిలో కరోనా వైరస్‌ ఉధృతి తీవ్రంగా ఉంది.సరిగ్గా 11 రోజుల్లోనే మరో లక్ష కొత్త కేసులు  నమోదయ్యాయి. దానితో మూడు లక్షల కేసులు దాటిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ మరో రికార్డు నమోదు చేసింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ మహారాష్ట్ర, తమిళనాడుల్లో మాత్రమే 3లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఆ జాబితాలో మూడో రాష్ట్రంగా ఏపీ చోటు దక్కించుకుంది. 
 
సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకూ కొత్తగా 9,652 మందికి కరోనా సోకింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌లు 3,06,261కి చేరాయి. రోజువారీ కేసుల్లో సైతం ఏపీ టాప్‌లోనే ఉంది. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా రోజుకు సగటున పదివేల కేసులు నమోదవడం లేదు. మహారాష్ట్రలోనూ రోజుకు 7-8 వేల కేసులు మాత్రం వెలుగు చూస్తున్నాయి. 
 
రాష్ట్రంలో తొలి లక్ష కరోనా కేసులకు 137 రోజులు పట్టింది. రెండో లక్ష మాత్రం కేవలం 11 రోజుల్లోనే వెలుగు చూశాయి. అనంతరం మూడో లక్ష కేసులు కూడా 11 రోజుల్లోనే నమోదయ్యాయి.
రాష్ట్రంలో మంగళవారం 9,211మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకూ 2,18,311మంది డిశ్చార్జ్‌ అయ్యారు. మంగళవారం కొవిడ్‌ మరో 88మందిని బలి తీసుకుంది.అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 14 మంది, ప్రకాశం జిల్లాలో 11 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 2,820కి పెరిగింది.