విధ్వంసకారుల నుండే సొమ్ము వసూలు 

బెంగళూరు హింసాకాండలో జరిగిన ఆస్తి నష్టాన్ని ఇందుకు కారణమైన దోషుల నుంచే వసూలు చేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ఓ ట్వీట్‌లో ఈ విషయం తెలిపారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం క్లెయిమ్ కమిషనర్ నియామకంపై హైకోర్టును ప్రభుత్వం ఆశ్రయిస్తుందని చెప్పారు. 

 ‘కేజీ హళ్లి, డీజీ హళ్లిలో చెలరేగిన హింసాకాండ ఘటనల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల నష్టాన్ని అంచానా వేసి, ఆ మొత్తాన్ని అపరాధుల నుంచి వసూలు చేసేందుకు నిర్ణయించాం’ అని ఆ ట్వీట్‌లో సీఎం తెలిపారు. ఈ కేసుల్లో వేగవంతమైన విచారణ కోసం ముగ్గురు ప్రత్యేక ప్రాసిక్యూటర్ల బృందాన్ని నియమించనున్నట్టు తెలిపారు. 

ఇప్పటికే ఈ ఘటనలపై సిట్ ఏర్పాటు చేశామని, సత్యర విచారణ కోసం ముగ్గురు సభ్యుల స్పెషల్ ప్రాసిక్యూషన్ టీమ్‌ను కూడా నియమిస్తామని పేర్కొన్నారు.  చట్టాన్ని చేతుల్లోకి తీసుకునేవారిపై కఠిన చర్యలకు కర్ణాటక పోలీసులు సిద్ధమయ్యారు. 

ఈ నెల 11న బెంగళూరులోని డీజీ హళ్లిలో జరిగిన హింసాకాండ నిందితులపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) ప్రకారం కేసులు నమోదు చేశారు.   మొదట్లో భారత శిక్షా స్మృతి (ఐపీసీ), కర్ణాటక ప్రభుత్వ ఆస్తుల నష్ట నిరోధక చట్టం ప్రకారం కేసులు నమోదు చేశారు. దర్యాప్తులో కొత్త విషయాలు తెలియడంతో యూఏపీఏ ప్రకారం ఆరోపణలు నమోదు చేసినట్లు తెలిపారు. 

కాగా, బెంగళూరు హింసాకాండకు సంబంధించి ఆదివారంనాడు 35 మంది అనుమానితులను అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో ఇంతవరకూ అరెస్టు చేసిన వారి సంఖ్య 340కి చేరినట్టు పోలీసులు తెలిపారు.  అల్లర్లు చెలరేగిన డీజే హళ్లి, కేజీ హళ్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో విధించిన 144 సెక్షన్‌ను ఈనెల 18వ తేదీ ఉదయం 6 గంటల వరకూ పొడిగించారు. ఈ ప్రాంతాల్లో ఇప్పటికీ ఉద్రిక్తత తొలగలేదని చెబుతున్నారు.