కోర్టులలో పెరిగిపోతున్న కేసులపై గవర్నర్ ఆందోళన 

దేశవ్యాప్తంగా కోర్టులలో పెరిగిపోతున్న కేసుల సంఖ్య పట్ల రాష్ట్ర గవర్నర్‌ డా.తమిళిసై సౌందరరాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయవిద్యలో నాణ్యత పెంచడం కీలకాంశమని ఆమె పేర్కొన్నారు. పెరుగుతున్న టెక్నాలజి, కుటుంబ సమస్యల నుండి మొదలు అంతర్జాతీయ స్థాయి సమస్యల వరకు కొత్త సవాళ్లు విసురుతున్నాయని ఆమె చెప్పారు. 

విషయ పరిజ్ఞానం, లోతైన అవగాహన, నైపుణ్యాలున్న న్యాయ విద్యార్ధులను తీర్చిదిద్దడానికి న్యాయవిద్య పరిధి విస్తృతం కావాలని గవర్నర్‌ సూచించారు. ”న్యాయ విద్య, పరిశోధన- కోవిడ్‌ సమాళ్లు” అన్న అంశంపై ఉస్మానియా యూనివర్సిటి న్యాయకళాశాల ఆధ్వర్యంలో మొదలైన 10 రోజుల ఆన్‌లైన్‌ కార్యశాలను గవర్నర్‌ ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కోవిడ్‌ మొత్తం విద్యారంగానికే సవాలు విసిరిందని చెబుతూ ఐతే లాక్‌డౌన్‌ విద్యా సంస్ధలకే కానీ విద్యకు కాదని ఆమె స్పష్టం చేశారు. ప్రతి సమస్య కొన్ని కొత్త అవకాశాలను సృష్టిస్తుందని, అలాగే కోవిడ్‌ సంక్షోభం విద్యా రంగంలో కొత్త తరహా ఆన్‌లైన్‌, డిజిటల్‌ లర్నింగ్‌, టీచింగ్‌ అవకాశాలను కల్పించిందని ఆమె పేర్కొన్నారు. 

కొత్తగా వస్తున్న జాతీయస్థాయి లా స్కూల్స్‌కు దీటుగా సంప్రదాయ విశ్వవిద్యాలయ లా కళాశాలలు సిలబస్‌ రూపకల్పన, వసతులు సమకూర్చుకొని అత్యుత్తమ న్యాయ విద్యను అందించాలని గవర్నర్‌ ఆకాంక్షించారు.