తెలంగాణ అంతటా పొంగుతున్న నదులు, వాగులు 

తెలంగాణ వ్యాప్తంగా నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు నదులు, వాగులు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి.  ములుగు జిల్లా జంప‌న్న వాగు పొంగి పొర్లుతుంది. మేడారం గ్రామం పూర్తిగా జంపన్న వాగులో ఉండిపోయింది. 
 
చరిత్రలో మొట్టమొదటి సారిగా వర్షపు నీరు గ్రామన్నే చుట్టేసింది. మేడారం గ్రామ బ్రిడ్జీపై నుండి వరద నీరు గ్రామంలోకి చేరుతున్న‌ది. ప్రస్తుతం మేడారం గద్దెల సమీపంలోని ఐటిడీఏ కార్యాలయానికి జంపన్న వాగు నీరు తాకింది. 
 
ఇప్పటికే చిలుకల గుట్టను తాకి గద్దెలవైపుగా పయనిస్తున్న వర‌ద‌.. మరి కాసేపట్లో మేడారం అమ్మవార్ల గద్దెలను తాక‌నున్నది. ఆ ప్రాంతాల‌న్నీ జ‌ల‌మ‌యం అవ‌డంతో ఇప్పటికే అక్క‌డ‌ జనజీవనం పూర్తిగా స్తంబించి పోయింది. పోలీసులు పస్రా నుండి మేడారం కు రవాణా సౌకర్యాలను పూర్తిగా నిలిపివేశారు. ఊరట్టం వద్ద జంపన్న వాగు నీరు…భారీగా వెళుతున్న‌ది.   
 
జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలో కుందనపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. వాగు దాటే ప్రయత్నంలో 12 మంది రైతులు నీటి ప్రవాహంలో చిక్కుకున్నారు. పోలీసులు, రెస్క్యూ టీం వారిని కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నా అవి సఫలం కాకపోవడంతో సంఘటనా స్థలానికి హెలికాఫ్టర్‌ చేరుకొని రైతులను కాపాడింది. 
 
 సిద్ధిపేట జిల్లా బస్వాపూర్ బ్రిడ్జి  పై నుంచి 2 మీటర్ల ఎత్తు నుంచి ప్రవహిస్తుంది తుమ్మదేవ వాగు.  ఈ రోజు తెల్లవారు జామున అటుగా వెళ్తున్న లారీ అందులోపడి కొట్టుకుపోయింది. అందులో నుండి లారీ క్లీనర్ ధర్మయ్య సురక్షితంగా బయటపడ్డాడు. కానీ డ్రైవర్  డ్రైవర్ ముదిగొండ శంకర్(35) చెట్టును పట్టుకొని ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. 
 
 కాగా,ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల హైదరాబాద్  నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్. లోకేష్ కుమార్ సూచించారు. మరికొన్ని రోజులు వర్షాలు ఇలాగే పడే అవకాశం ఉన్నందున.. శిధిలావస్థకు చేరిన భవనాలు, ప్రహరీ గోడలు, ఇతర నిర్మాణాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు.