త్వరలో భారతీయ కరోనా వ్యాక్సిన్ 

శాస్త్రవేత్తలు , నిపుణుల సూచన ప్రకారం అతి త్వరలోనే భారత్ లో తయారీ కరోనా వ్యాక్సిన్‌ను తీసుకొస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో భారత్ లో మూడు వ్యాక్సిన్‌లు అభివృద్ధి దశల్లో ఉన్నాయని వెల్లడించారు. 
 
అవి వివిధ ప్రయోగ దశలలో ఉన్నట్లు చెచెబుతూ  కరోనా వైరస్ వ్యాక్సిన్‌ ఉత్పత్తికి సంబంధించి రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నామని తెలిపారు.  దేశంలో వ్యాక్సిన్‌ను అందరికీ పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
 
`భారత్ లో మూడు కరోనా వైరస్ వ్యాక్సిన్‌లు పలు ప్రయోగ దశల్లో ఉన్నాయి. దేశ ప్రజలకు వాటి పంపిణీ, ఉత్పత్తికి సంబంధించి రోడ్‌మ్యాప్‌ కూడా సిద్ధంగా ఉంది. ప్రతి భారతీయుడికి కరోనా వ్యాక్సిన్‌ అందిస్తామని ప్రభుత్వం హామీ ఇస్తోంది’ అని ప్రధాని భరోసా ఇచ్చారు. 
 
కరోనా కష్టకాలంలోనూ మనం కొత్తదారులు వెతుక్కుందామని చెబుతూ  పీపీఈ కిట్లు, ఎన్‌95 మాస్కులు కూడా వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉండేదని, నాలుగు నెలల్లో స్వయం సమృద్ధి సాధించి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు గుర్తు చేశారు. 
కరోనా విపత్కర పరిస్థితుల్లో పని చేస్తున్న వైద్య సిబ్బందికి ప్రమాణం చేస్తూ మహమ్మారి నివారణకు వైద్యులు, నర్సులు, అంబులెన్స్‌ డ్రైవర్లు అందరూ ప్రజల ఆరోగ్యానికి కాపాడేందుకు నిరంతరం కృషి చేస్తున్నారని ప్రధాని కొనియాడారు. కరోనా ఒక్కటే కాదు దేశవ్యాప్తంగా వరదలు, ప్రకృతి విపత్తులు మనల్ని చుట్టు ముట్టాయని పేర్కొన్నారు.
 
కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఏకతాటిపై ఉండి విపత్తులను ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నాయని చెబుతూ సవాళ్లు మన సంకల్పాన్ని మరింత సుధృడం చేస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. 25 ఏళ్లు వచ్చిన ప్రతి బిడ్డ సొంత కాళ్లపై నిలబడాలని కుంటుంబం కోరుకుంటుందని, ఈ క్షణం స్వయం సమృద్ధికి బలమైన సంకల్పంతో ముందుకు వెళ్లాలని ప్రధాని పిలుపునిచ్చారు.