దివాళా స్థితిలో  తెలుగు రాష్ట్రాల ఆర్ధిక నిర్వహణ 

తెలుగు రాష్ట్రాలు పన్నుల ద్వారా వచ్చిన ఆదాయాలను కాకుండా అప్పులద్వారా తీసుకు వచ్చిన మొత్తాలను ప్రజాకర్షణ పథకాలకు ఖర్చు  పెడుతూ ఉండడంతో ఆర్ధిక పరిస్థితులు దివాళా స్థితిలో ఉన్నాయని మాజీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు. 
 
గోపాలరావు ఠాకూర్ స్మారక ప్రసంగాన్ని వీడియో కాన్ఫరెన్స్ లో ఇస్తూ ఏపీ కన్నా తెలంగాణ ఆర్ధిక పరిస్థితులు, పాలనలు మెరుగుగా లేవని స్పష్టం చేశారు. అయితే వారికి హైదరాబాద్ నగరంలో మంచి ఆదాయం ఉంటూ ఉండడంతో వారి పరిస్థితులు కొంచెం మెరుగుగా ఉన్నట్లు పేర్కొన్నారు. 
 
ప్రస్తుతం మొత్తం మీద ఏపీ అప్పులు రూ. 3.2 లక్షల కోట్లుగా ఉంటె, తెలంగాణ అప్పులు రూ.  2 లక్షలు ఉన్నట్లు చెప్పారు. ప్రతి నెలా జీతాలు, పెన్షన్లు కూడా సక్రమంగా ఇవ్వలేని పరిస్థితులలో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నట్లు విచారం వ్యక్తం చేశారు. 
 
తెలంగాణ ప్రభుత్వ అధికారులు దీర్ఘకాలిక అప్పులు తీసుకొంటూ ఉండడంతో వారిపై ప్రతి నెలా అప్పులు చెల్లించే భారం కొంత తక్కువగా ఉన్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ  పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా చెల్లింపు పట్ల సరిగ్గా దృష్టి పెట్టక పోవడంతో తెలుగు రాష్ట్రాలు పలు పధకాలను, నిధులను కోల్పోతున్నట్లు చెప్పారు. 
 
గత సంవత్సరం మొత్తం మీద ఏపీ ప్రభుత్వం రూ 50,000 కోట్లు రుణాలు తీసుకొంటే, గత ఏప్రిల్ నెలలోనే రూ 17,000 కోట్లు తీసుకోవడం ప్రస్తావిస్తూ అప్పులపైననే ప్రభుత్వం నడుస్తున్నట్లు విస్మయం వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాల బడ్జెట్ ప్రతిపాదనలు వాస్తవికతలకు దగ్గరగా ఉండడం లేదని విమర్శించారు. 
 
కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన రైల్వే ప్రాజెక్ట్ లు రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా నిధులు చెల్లింపక పోవడం, శ్రద్ద చూపని కారణంగా పూర్తి కావడం లేదని తెలిపారు. తూర్పు సముద్ర తీరంలో మంచి ఓడరేవు సదుపాయాలు లేకపోవడంతో సరుకులు పంపడానికి పశ్చిమ తీరం వరకు వీడుతున్నారని చెబుతూ ఓడరేవుల అభివృద్ధి పట్ల దృష్టి సారిస్తే ఏపీలో మంచి అభివృద్ధికి అవకాశం ఉంటుందని చెప్పారు. 
 
గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్కువగా హడావుడి చేస్తూ పోలవరం వంటి పనులు తక్కువగా చేస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హడావుడి లేదు, పనులు కూడా లేవని ధ్వజమెత్తారు. రాష్ట్రాభివృద్ధి పట్ల, పాలన పట్ల ముఖ్యమంత్రికి అవగాహన లేదని విమర్శించారు. నిజమైన అభివృద్ధి అజెండాతో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని విచారం వ్యక్తం చేశారు. 
 
చైనా నుండి తరలిపోతున్న పరిశ్రమలను తెచ్చుకోగలిగితే రాష్ట్రానికి మంచి అవకాశాలు లభిస్తాయని కృష్ణారావు సూచించారు. సీనియర్ బిజెపి నాయకులు పివి చలపతిరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మి నారాయణ, ఎమ్యెల్సీ పివిఎన్ మాధవ్, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యమూర్తి తదితరులు పాల్గొన్నారు.