హాంగ్‌కాంగ్ మీడియా దిగ్గ‌జం అరెస్టు

జాతీయ భ‌ద్ర‌తా చ‌ట్టం కింద హాంగ్ కాంగ్ దిగ్గ‌జ వ్యాపార‌వేత్త, మీడియా టైకూన్‌ జిమ్మీ లేను అరెస్టు చేశారు.  విదేశీ శ‌క్తుల‌తో అత‌ను జ‌త‌క‌ట్టాడ‌న్న‌ ఆరోప‌ణ‌ల‌పై అరెస్టు చేశారు. జూన్ నెల‌లో చైనా వివాదాస్ప‌ద జాతీయ భ‌ద్ర‌తా చ‌ట్టాన్ని రూపొందించిన విష‌యం తెలిసిందే. భ‌ద్ర‌తా చ‌ట్టాన్ని వ్య‌తిరేకిస్తూ హాంగ్‌కాంగ్‌లో జ‌రిగిన అల్ల‌ర్ల‌కు జిమ్మీ లే మ‌ద్ద‌తు ఇచ్చిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి.
71 ఏళ్ల జిమ్మీకి బ్రిట‌న్‌లోనూ పౌర‌స‌త్వం ఉన్న‌ది. నెక్ట్స్ డిజిట‌ల్ మీడియా జిమ్మీదే.  ఆ కంపెనీలోకి కూడా హాంగ్ కాంగ్ పోలీసులు ప్రవేశించినట్లు స్థానిక మీడియా పేర్కొన్న‌ది.  జిమ్మీ ఆఫీసుల‌ను తనిఖీ చేశారు.   జిమ్మీ లే ఆస్తి సుమారు వంద కోట్ల డాల‌ర్లు ఉంటుంది.  తొలుత అత‌ను వ‌స్త్ర వ్యాపారం నిర్వ‌హించారు.  ఆ త‌ర్వాత ఆయ‌న మీడియా రంగంలోకి ప్రవేశించారు.  యాపిల్ డైలీ అనే ప‌త్రిక‌ను ప్రారంభించారు.
 హాంగ్ కాంగ్‌తో పాటు చైనా ఆధిప‌త్యాన్ని ఆ ప‌త్రిక వ్య‌తిరేకించేది. డ్రాగ‌న్ దేశ ఎత్తుల‌ను జిమ్మ లే ఎప్ప‌టిక‌ప్పుడు త‌ప్పుప‌ట్టేవారు.  2019లో జ‌రిగిన అల్ల‌ర్ల‌లో ఆయ‌న స్వ‌యంగా పాల్గొన్నారు. చైనాకు వ్య‌తిరేకంగా నెగ‌టివ్ ప్ర‌చారం చేసిన‌ట్లు లేపై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. గ‌త ఏడాది జ‌రిగిన అల్ల‌ర్ల‌కు ఆయ‌నే మాస్ట‌ర్‌మైండ్ అని ఆరోప‌ణ‌లు కూడా ఉన్నాయి.