కీలక వడ్డీ రేట్లు యథాతథం  

కీలక వడ్డీ రేట్లను ఈసారి యథాతథంగానే ఉంచుతున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. ఇవాళ జరిగిన ద్రవ్య పరపతి విధాన సమీక్ష సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ఈ మేరకు ప్రకటించారు. రెపో రేటు 4 శాతం, రివ‌ర్స్ రెపో రేటును 3.3 శాతంగానే య‌ధాత‌థంగా ఉంచుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. 
 
బ్యాంకులకు ఇచ్చే రుణాల నుంచి ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటును రెపోరేటు అనీ.. బ్యాంకులకు ఆర్బీఐ చెల్లించే వడ్డీ రేటును రివర్స్ రెపోరేటు అని అంటారు. రెపోరేటు తగ్గితే తద్వారా వచ్చే లబ్ధిని తమ వినియోగదారులకు బదలాయించవచ్చునని బ్యాంకులు ఆశిస్తాయి. 
 
తద్వారా గృహ, వాహన రుణాలు సహా ఇతర రుణాలపై వడ్డీ భారం తగ్గి ఈఎంఐల భారం తగ్గుతుంది. ఈ సారి వడ్డీరేట్లను ఆర్బీఐ కనీసం 25 బేస్ పాయింట్లు తగ్గిస్తుందని వ్యాపార వర్గాలు ఆశించాయి.
కాగా నేషనల్ హౌసింగ్ బ్యాంకు (ఎన్‌హెచ్‌బీ), నాబార్డ్‌ల (జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు) ద్వారా అదనంగా మరో రూ.10 వేల కోట్ల మేర నగదు లభ్యతను అందుబాటులోకి తెస్తున్నట్టు ఆర్బీఐ గవర్నర్ వెల్లడించాయిరు. అంతర్జాతీయ ఆర్థిక కార్యకలాపాలు ఇప్పటికీ మందకొడిగానే కొనసాగుతున్నాయని తెలిపారు. 
 
ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్నట్టు కనిపించినా ఇటీవల ఒక్కసారిగా పెరిగిన కరోనా కేసులతో మళ్లీ మందగమనం తప్పడం లేదని ఆర్బీఐ ప్రకటించింది. కరోనా కల్లోలం, తదనంతర లాక్‌డౌన్ కారణంగా కుంటుపడిన ఆర్థిక రంగానికి ఊతమిచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది.

 ఈ నిర్ణయాలతోపాటు బంగారు ఆభరణాలపై రుణాల పరిమితిని పెంచేందుకు ఆర్‌బీఐ నిర్ణయించింది. తద్వారా బ్యాంకులు, ఫైనాన్షియల్‌ సంస్థలు ఆభరణాల విలువలో ఇకపై 90 శాతం వరకూ రుణాన్ని ఇచ్చేందుకు వీలు చిక్కనుంది. ఇప్పటివరకూ 75 శాతం విలువవరకూ రుణాల మంజూరీకి అనుమతి ఉంది. ఈ నిర్ణయాలు 2021 మార్చి నుంచి అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది.